హైదరాబాద్: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మచ్చ బొల్లారం గోపాల్ నగర్లో విషాదం నెలకొంది. ఫోన్ ఎక్కువ చూస్తున్నావని తల్లి మందలించడంతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల ప్రకారం.. రుతిక (19) అనే యువతి లయోలా డిగ్రీ కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అయితే.. తరచూ ఫోన్ వాడుతున్నావని రుతికను వాళ్ల తల్లి మందలించింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రుతిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం క్లూస్ టీం సహాయంతో ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చిన్న కారణానికి బిడ్డ ప్రాణాలు తీసుకోవడంతో రుతిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
