- లీగ్ లోనే నిష్ర్కమించిన తెలంగాణ మహిళల జట్టు
హనుమకొండ/ధర్మసాగర్, వెలుగు : కాజీపేట రైల్వే స్టేడియంలో 58వ నేషనల్ సీనియర్స్ ఖోఖో ఛాంపియన్ షిప్ పోటీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్, తెలంగాణ ఖోఖో అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మూడు రోజుల నుంచి జరుగుతున్న పోటీల్లో మంగళవారం జరిగిన మ్యాచ్ ల్లో డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన మహారాష్ట్ర విమెన్స్, రైల్వేస్ మెన్స్ టీమ్స్ ముందంజలో ఉన్నాయి.
లీగ్ మ్యాచ్ లో ఉత్తరప్రదేశ్ పై మహారాష్ట్ర, పుదుచ్చేరిపై పురుషుల రైల్వేస్ టీమ్ గెలుపొంది ప్రి-క్వార్టర్ ఫైనల్ కు చేరాయి. మహిళల విభాగంలో హర్యానాపై కొల్హాపూర్, కేరళ పై గుజరాత్, పశ్చిమ బెంగాల్ పై కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ పై తమిళనాడు గెలుపొందాయి. విదర్బపై ఒడిశా , పంజాబ్ పై ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, రాజస్థాన్ పై ఢిల్లీ గెలిచి ప్రి క్వార్టర్స్ కు చేరాయి. పురుషుల లీగ్ మ్యాచ్ లో ఆతిథ్య తెలంగాణపై కర్ణాటక, ఢిల్లీపై కేరళ, చత్తీస్ గడ్ పై పశ్చిమ బెంగాల్, తమిళనాడుపై ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ పై మహారాష్ట్ర , గుజరాత్ పై కొల్హాపూర్, విదర్భపై ఒడిశా విజయం సాధించి ప్రి-క్వార్టర్ ఫైనల్ కు చేరాయి.
ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో తెలంగాణ మహిళల జట్టు ఓటమి చెంది నిష్ర్కమించింది. కాగా ఆతిథ్య తెలంగాణ పురుషుల జట్టు ఆంధ్రప్రదేశ్ తో తలపడనుంది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లు బుధవారం ఉదయం నుంచి జరగనున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జంగా రాఘవరెడ్డి, నాతి కృష్ణమూర్తి తెలిపారు. ఇందులో డీవైఎస్ వోలు గుగులోతు అశోక్ కుమార్, నడిపెల్లి సుధాకర్ రావు, సీనియర్ ఖోఖో కోచ్ యతిరాజ్, వరంగల్ జిల్లా ఖోఖో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పాల్గొన్నారు.
