తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామ శివారులో ఫారెస్ట్ ఆఫీసర్లు, పోడు రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. మంగళవారం అటవీ శాఖ అధికారులు ఫారెస్ట్ ల్యాండ్ చుట్టూ ట్రెంచ్ కొట్టేందుకు యత్నించగా, ఏళ్ల తరబడి తాము పోడు భూములు సాగు చేస్తున్నామని పోడు రైతులు ఆందోళనకు దిగారు. దీంతో కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. దూదేకులపల్లి రేంజ్లోని సింగారం బీట్ పరిధిలో ఛత్తీస్గఢ్ నుంచివలస వచ్చిన గొత్తికోయలు, ఆదివాసీ గిరిజనులు 160 ఎకరాల భూమిని సాగు చేస్తున్నారు.
ఈక్రమంలో మంగళవారం ఉదయం ఫారెస్ట్ ఆఫీసర్లు రమేశ్, సీతారాంనాయక్ ఆధ్వర్యంలో 16 మంది సిబ్బంది జేసీబీతో పోడు భూమి చుట్టూ ట్రంచ్ కొట్టేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న పోడు రైతులు, మహిళలు జేసీబీని చుట్టుముట్టి ఫారెస్ట్ ఆఫీసర్లతో వాగ్వాదానికి దిగారు. పోడు భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఫారెస్ట్ ఆఫీసర్లు ఉన్నతాధికారులతో మాట్లాడి వెనుదిరిగారు.
