- 2.810 టీఎంసీల కెపాసిటీతో
- గొల్లపల్లి- –చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణం
- జిల్లాలో 40 వేల ఎకరాలకు సాగునీరు
- నష్టపరిహారం చెల్లించాలని రైతుల డిమాండ్
వనపర్తి, వెలుగు : పాలమూరు-–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఏదుల బ్యాలెన్సింగ్రిజర్వాయర్ సమీపంలో జిల్లా ప్రజలకు సాగు నీరందించేందుకు గొల్లపల్లి-–చీర్కపల్లి రిజర్వాయర్‌ను నిర్మించనున్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణానికి గత బీఆర్ఎస్ప్రభుత్వం జీవో వచ్చింది.
ఏదులకు సమీపంలో రిజర్వాయర్వద్దంటూ నాడు రైతులు అభ్యంతరం తెలిపారు. ఎన్నికలు సమీపించడంతో అది అప్పటికే ఆగిపోయింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం గొల్లపల్లి-–చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్నితెరపైకి తెచ్చింది. త్వరలోనే టెండర్ ప్రక్రియ మొదలు కానుంది.
1,352 ఎకరాల భూసేకరణ..
గొల్లపల్లి-–చీర్కపల్లి రిజర్వాయర్‌ను 2.810 టీఎంసీల కెపాసిటీతో నిర్మించనున్నారు. అందుకు రూ.11 వేల కోట్ల ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ఏదుల రిజర్వాయర్ తల్పునూరు ప్యాకేజీ నం.29 నుంచి ఓటీ పాయింట్పెట్టి ఈ రిజర్వాయర్‌ను నింపుతారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డి–8, డి-–5 కాల్వలకు లింక్ లిస్తారు. బండరావిపల్లి పాకుల వైపు ఉన్న ఒక తూము ద్వారా గోపాల్పేట, చెన్నారం, రేవల్లి గ్రామాలకు నీరందిస్తారు.
ఈ రిజర్వాయర్ద్వారా వనపర్తి జిల్లాలో 40 వేల ఎకరాలకు సాగునీరందుతుందని ఇరిగేషన్ ఆఫీసర్లు అంచనా వేశారు. ఇందుకోసం 1,352 ఎకరాల్లో వెయ్యి ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. మళ్లీ రిజర్వాయర్ నిర్మాణంతెరపైకి రావడంతో సమీప గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయర్కింద పెద్ద మొత్తంలో భూములు కోల్పోయే వారికి మెరుగైన నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
మూడు గ్రామాలు మునుగుతాయి..
బీఆర్‌ఎస్‌పాలనలో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఈ రిజర్వాయర్‌కు ప్రపోజ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో రైతులు వ్యతిరేకిస్తే నిర్మాణ పనులు ఆగిపోయాయి. అప్పుడు ఎక్కువ టీఎంసీలతో నిర్మించాలనుకున్నా.. ఇప్పుడు తక్కువ టీఎంసీతో నిర్మిస్తున్నారు. నష్టపరిహారం ఎకరానికి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలుగా ఇస్తే రైతులు కాస్తా సంతృప్తి చెందే అవకాశం ఉంది. - ఎండీ జబ్బార్, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు, వనపర్తి
