IND vs NZ 2nd ODI: కూల్‌గా కొట్టేసిన కివీస్: భారీ సెంచరీతో ఇండియాను ఓడించిన మిచెల్

IND vs NZ 2nd ODI: కూల్‌గా కొట్టేసిన కివీస్:  భారీ సెంచరీతో ఇండియాను ఓడించిన మిచెల్

న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్దేలో టీమిండియా ఓడిపోయింది. బ్యాటర్లతో పాటు బౌలర్లు కూడా విఫలం కావడంతో మన జట్టుకు పరాజయం తప్పలేదు. బుధవారం (జనవరి 14) రాజ్ కోట్ వేదికగా నిరంజన్ షా స్టేడియంలో ముగిసిన ఈ మ్యాచ్ లో ఇండియాపై 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. డారిల్ మిచెల్ (131*) సెంచరీతో కివీస్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. విల్ యంగ్ 87 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మొదట బ్యాటింగ్ చేసిన మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. ఛేజింగ్ లో న్యూజిలాండ్ 47.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసి గెలిచింది. 

మిచెల్, యంగ్ భారీ భాగస్వామ్యం:
  
285 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ కు మంచి ఆరంభం దక్కలేదు. తొలి వన్డేలో 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పోయిన కాన్వే, నికోల్స్ త్వరగానే ఔటయ్యారు. కివీస్ స్కోర్ 22 పరుగుల వద్ద కాన్వేను (10) హర్షిత్ రానా బౌల్డ్ చేసి తొలి వికెట్ అందించాడు. మరో ఓపెనర్ హెన్రీ నికోల్స్ క్రీజ్ లో ఉన్నంతవరకు ఇబ్బంది పడి 24 బంతుల్లో 10 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. 46 పరుగులకే రెండు వికెట్ల్య్ కోల్పోయి కష్టాల్లో పడిన న్యూజిలాండ్ ను డారిల్ మిచెల్ (131), యంగ్ (87) ఆదుకున్నారు. 

మిచెల్ సెంచరీ:
 
వీరిద్దరూ ఆరంభంలో పరుగులు చేయడానికి సమయం తీసుకున్నా ఆ తర్వాత స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించారు. దీనికి తోడు మంచు ప్రాభవం టీమిండియాకు ప్రతికూలంగా మారింది. మిచెల్, యంగ్ టీమిండియా బౌలర్లపై పూర్తిగా ఆధిపత్యం చూపించి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో వీరిద్దరూ తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 162 పరుగులు జోడించి కివీస్ ను గెలుపు దగ్గరకు చేర్చారు. ఈ జోడీని కుల్దీప్ విడగొట్టినా.. ఫిలిప్స్ (32) తో కలిసి మిచెల్ తన సెంచరీ మార్క్ పూర్తి చేసుకొని జట్టుకు విజయాన్ని అందించాడు. ఇండియన్ బౌలర్లలో హర్షిత్ రానా, కుల్దీప్, ప్రసిద్ కృష్ణ తలో వికెట్ పడగొట్టారు.   

సెంచరీతో రాహుల్ ఒంటరి పోరాటం:
 
ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన ఇండియా మొదట బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమాన్ గిల్ తొలి వికెట్ కు 70 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. పవర్ ప్లే లో గిల్ వేగంగా పరుగులు చేసినా మరో ఎండ్ లో హిట్ మ్యాన్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు. క్రీజ్ లో ఉన్నంత సేపు ఇబ్బందిపడిన రోహిత్ 38 బంతుల్లో కేవలం 24 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ దశలో కోహ్లీతో జత కలిసిన గిల్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 56 పరుగులు చేసి దూకుడు మీదున్న గిల్ ను ఒక షార్ట్ బాల్ వేసి పెవిలియన్ కు చేర్చాడు. కాసేపటికి ఫామ్ లో ఉన్న కోహ్లీని క్రిస్టియన్ క్లార్క్ సూపర్ డెలివరీతో ఔట్ చేశాడు. 

కోహ్లీకి ముందే అయ్యర్ కూడా 8 పరుగులే చేసి ఔట్ కావడంతో ఇండియా 118 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో జట్టును ఆదుకునే బాధ్యత కేఎల్ రాహుల్, జడేజా తీసుకున్నారు. ఇద్దరూ జాగ్రత్తగా ఆడుతూ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో రాహుల్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 27 పరుగుల వద్ద జడేజా ఔట్ కావడంతో ఆ తర్వాత వచ్చిన నితీష్ కుమార్ రెడ్డితో రాహుల్ మరో భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ముందుకు తీసుకెళ్లాడు. ఒక వైపు వికెట్లు పడినా మరో ఎండ్ లో రాహుల్ ఒంటరి పోరాటం చేస్తూ జట్టు స్కోర్ ను 284 పరుగులకు చేర్చాడు.