అమెరికా కీలక బేస్ లపై దాడులకు దిగుతామని ఇరాన్ హెచ్చరించిన క్రమంలో అమెరికా ఒక అడుగు వెనక్కు తగ్గింది. ఇరాన్ చుట్టూ ఉన్న సైనిక స్థావరాల నుంచి దళాలను మెల్లమెల్లగా ఉపసంహరించుకుంటోంది. అమెరికా దళాలకు ఆశ్రయం ఇచ్చిన దేశాలపై.. ముఖ్యంగా అమెరికా స్థావరాలపై దాడులకు దిగుతామని బుధవారం (జనవరి 14) హెచ్చరించింది. దీనికి కారణం.. ఖమేనీ ప్రభుత్వం దిగిరాకపోతే ఇరాన్ పై ఎయిర్ స్ట్రైక్స్ చేస్తామని అమెరికా హెచ్చరించడమే. ఆ తర్వాత ఇరాన్ అదే స్థాయిలో స్పందించి.. కీలక స్థావరాలపై దాడులకు దిగుతామని చెప్పడంతో యూఎస్ ట్రూప్స్ వెనక్కు తగ్గుతున్నాయి.
మిడిల్ ఈస్ట్ లో అమెరికా సైన్యం ఎక్కువగా ఉన్న దేశం ఖతార్. ఇరాన్ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని సైనికులు వెనక్కు వెళ్లాలని ఖతార్ సూచించినట్లు తెలుస్తోంది.
ఇరాన్ లో జరుగుతున్న ఆందోళన కారులకు మద్ధతుగా బుధవారం యూఎస్ ప్రసిడెంట్ ట్రంప్ ప్రకటనతో ఇరాన్ మరింత దూకుడు పెంచింది. ఇరాన్ లో ఆందోళనలు ఉధృతం చేయాలని.. ప్రభుత్వ సంస్థలను ఆధీనంలోకి తెచ్చుకోవాలని నిరసనకారులకు పిలుపునిచ్చాడు ట్రంప్. అదే క్రమంలో ఇరాన్ పై స్ట్రైక్స్ తప్పవని కూడా హెచ్చరించాడు. దీంతో ఇరాన్ అంతర్యుద్ధంలో యూఎస్ కలగజేసుకోవడం ఖాయమనేది స్పష్టమైన తర్వాత ఇరాన్ సై అంటే సై అన్నట్లుగా వ్యవహరిస్తోంది.
ఇరాన్ గన్ఫైర్ డ్రిల్స్ తో మరింత ఉత్కంఠ:
మరోవైపు ఇరాన్ పర్షియన్ గల్ఫ్ తీరంతో పాటు ఇరాక్ , అజెర్బైజాన్ బార్డర్ లలో గన్ ఫైర్ డ్రిల్స్ చేపట్టింది. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు మద్ధతునిస్తూ, తమ దేశ అంతర్గత వ్యవహారాలల జోక్యం చేసువడాన్ని సహించేది లేదని అమెరికాకు గట్టిగా బదులిస్తోంది ఇరాన్.
శత్రువుల ఎయిర్ క్రాఫ్ట్ లను కూల్చివేయగల యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ తో డ్రిల్స్ చేపట్టింది ఇరాన్. ఇరాన్ దక్షిణ, వాయువ్య (నార్త్ వెస్ట్) సరిహద్దులలోని డేంజర్ జోన్ లకు దూరంగా ఉండాలని గత వారం నుంచి పైలట్లకు దాదాపు 20 నోటీసులు జారీ చేసింది ఇరాన్ ((NOTAMs). సముద్రమట్టం నుంచి 17 వేల ఫీట్ల కింద నుంచి వెళ్లవద్దని.. యూఎస్ మిలిటరీ జెట్స్ టార్గెట్ చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. అమెరికా సైన్యం ఎప్పుడు దాడి చేసిన తిప్పి కొట్టే వ్యూహంలో ఇరాక్, అజర్బైజాన్ తీరాలలో దాదాపు 20 స్థానాలలో గన్ ఫైర్ డ్రిల్స్ చేపట్టింది ఇరాన్.
