హోం శాఖ ఒవైసీ బ్రదర్స్‌‌ చేతుల్లో ఉందా? : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

హోం శాఖ ఒవైసీ బ్రదర్స్‌‌ చేతుల్లో ఉందా? : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
  • లా అండ్‌‌ ఆర్డర్‌‌ కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
  •     బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్
  •     పంట బీమా కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామని వెల్లడి
  •     కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్‌‌ ఆఫీస్‌‌లో బీజేపీఎల్పీ మీటింగ్‌‌

కామారెడ్డి/కామారెడ్డిటౌన్, వెలుగు: రాష్ట్రంలో లా అండ్‌‌ ఆర్డర్‌‌ను కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్‌‌రెడ్డి, ఉపనేత పాయల్‌‌  శంకర్‌‌  విమర్శించారు. రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేకే సెక్యూరిటీ లేకపోతే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి క్యాంప్‌‌  ఆఫీసులో శనివారం బీజేపీఎల్పీ మీటింగ్‌‌  నిర్వహించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన అంశాలపై తీర్మానాలు చేశారు. 

రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న అంశాలు, లా అండ్‌‌ ఆర్డర్‌‌, పంటల బీమా, ఎంప్లాయీస్‌‌, రిటైర్డ్‌‌ ఎంప్లాయిస్‌‌లకు రావాల్సిన బకాయిలు, గ్యారంటీల అమలు, మూసీ వెంట బాధితుల తరలింపు తదితర అంశాలపై చర్చించారు. సమావేశం తర్వాత మీడియాతో ఏలేటి మహేశ్వర్‌‌రెడ్డి, పాయల్‌‌ శంకర్‌‌  మాట్లాడారు. 

కామారెడ్డిలో సీఎం రేవంత్‌‌ రెడ్డి ఓడిపోయినందువల్లే బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డిపై కక్షగట్టి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్‌‌  నాయకులు పోలీసు వలయాన్ని దాటి ఎమ్మెల్యే క్యాంప్‌‌ ఆఫీస్‌‌  వద్దకు వచ్చి దాడి చేశారని, ఇందుకు రేవంతే బాధ్యత వహించాలన్నారు. కామారెడ్డి, బాన్సువాడ, నాగర్‌‌ కర్నూల్‌‌ జిల్లాలో జరిగిన అంశాలను పరిశీలిస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా లోపించినట్లు కనిపిస్తున్నాయని విమర్శించారు. కామారెడ్డిలో ఐదుగురు బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేశారని, బాన్సువాడలో ఓ వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు 13 మందిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌‌కు పంపించారని ఆరోపించారు. 

ఎంఐఎం నేతల ఒత్తిడి మేరకే కేసులు నమోదు చేశారని, అసలు హోం శాఖ రేవంత్‌‌ రెడ్డి చేతిలో ఉందా, ఒవైసీ బ్రదర్స్‌‌  చేతుల్లో ఉందా అని ప్రశ్నించారు. ఇక కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్‌‌ బీమాను మిగతా రాష్ట్రాల్లో అమలు చేస్తుంటే, తెలంగాణలో మాత్రం అమలు చేయట్లేదన్నారు. ఫసల్‌‌ బీమా అమలు చేసి ఉంటే వడగండ్ల కారణంగా నష్టపోయిన రైతులకు మేలు జరిగేదన్నారు. రైతుల నుంచి అప్లికేషన్లను స్వీకరించి వాటిని అసెంబ్లీకి తీసుకెళ్లి బీమా అమలుకు ఒత్తిడి చేస్తామన్నారు. అప్లికేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని ఈనెల 7న ఆదిలాబాద్‌‌  నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. 

మూసీ బాధితులపై అసెంబ్లీలో ప్రస్తావిస్తం

ఎంప్లాయీస్, టీచర్లు, రిటైర్డ్‌‌  ఎంప్లాయీస్‌‌కు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్  శంకర్  డిమాండ్‌‌ చేశారు. మూసీ బాధితుల తరలింపు అంశంపై అసెంబ్లీలో చర్చకు వచ్చేలా చూస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రజలకు చెప్పుకోలేక  వైఫల్యాలను  కప్పుపుచ్చుకునేందుకు ఎదురుదాడి చేస్తోందన్నారు. 

గత బడ్జెట్‌‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన ఫండ్స్‌‌ను కూడా ఖర్చు చేయడం లేదన్నారు. 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణా రెడ్డి, ధన్‌‌పాల్‌‌  సూర్యనారాయణ గుప్తా, రామారావు పటేల్‌‌, పాల్వాయి హరీశ్‌‌బాబు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొన్నారు. 

బాన్సువాడకు వెళ్తున్న నేతల అడ్డగింత

కామారెడ్డి నుంచి బాన్సువాడకు వెళ్తున్న బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌‌రెడ్డి, ఉప నేత పాయల్‌‌ శంకర్‌‌, ఎమ్మెల్యేలు ధన్‌‌పాల్‌‌ సూర్యనారాయణ, పాల్వాయి హరీశ్‌‌బాబు, రామారావు పటేల్, ఎమ్మెల్సీ అంజిరెడ్డిని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. సదాశివనగర్​  మండలం పద్మాజీవాడి చౌరస్తా వద్ద పోలీసులు ఎమ్మెల్యేలను అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం వారిని పోలీసులు అరెస్టు చేసి హైవేపై కొంత దూరం తీసుకెళ్లిన తర్వాత వారి సొంత వెహికల్స్‌‌ లో పంపించారు.