- అన్ని భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నం
- ఇన్లెట్ వైపు నుంచీ త్వరలోనే పనులు ప్రారంభిస్తమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు వేగంగా సాగుతున్నాయని, కేవలం వారంలోనే 20 మీటర్ల మేర పనులు పూర్తయ్యాయని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఔట్లెట్ వైపు నుంచి ఏడేండ్లుగా ఆపేసిన పనులను.. ఇటీవల ప్రారంభించామని తెలిపారు. శనివారం ఆయన సెక్రటేరియెట్‌లో ఇరిగేషన్ శాఖ అధికారులతో రివ్యూ చేశారు. పనుల పురోగతి, భద్రతా ప్రమాణాలు, వెంటిలేషన్ కోసం తీసుకుంటున్న చర్యలు, ఊరుతున్న నీటిని తోడే పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పనులు చేసేందుకు భారీగా సిబ్బంది, అవసరమైన పరికరాలను తరలించామని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ఇప్పటిదాకా ఏడు బ్లాస్టింగ్స్ చేపట్టారన్నారు. సిబ్బంది భద్రత కోసం టన్నెల్ డ్రిల్లింగ్ పనులను అత్యాధునిక పద్ధతుల్లో చేపడుతున్నామని, పనులను క్లోజ్‌గా మానిటర్ చేస్తున్నామని వివరించారు. అవసరమైన చోట ఎక్స్ట్రా సపోర్ట్ ఇస్తున్నామని పేర్కొన్నారు. వెంటిలేషన్ సమస్యలను అధిగమించేందుకు నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రత్యేకమైన పరికరాలను తెప్పించిందని, దీంతో పనులను మరింత వేగంగా పూర్తి చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు.
ప్రొటోకాల్‌కు అనుగుణంగా పనులు
టన్నెల్ ఇన్లెట్ వైపు నుంచి కూడా త్వరలోనే పనులను ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఇప్పటికే 20 మీటర్ల మేర ఓపెన్ కట్, అదనపు భద్రతా చర్యలకు సంబంధించిన పనులు ఇప్పటికే జరుగుతున్నాయన్నారు.కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలను పాటిస్తూ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రొటోకాల్స్‌కు అనుగుణంగా 24 గంటల పాటు పనులను చేయాలన్నారు.
2027 చివరి నాటికి ప్రాజెక్టుకు ఓ రూపు తేవాలని, 2028 జూన్ నాటికి దానిని పూర్తి స్థాయిలో ప్రారంభించేలా ముందుకు సాగాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ఇరిగేషన్ శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, టన్నెల్ సెక్రటరీ కల్నల్ పరీక్షిత్ మెహ్రా, ఈఎన్సీ రమేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
