- వినూత్న కార్యక్రమానికి ఎండోమెంట్ డైరెక్టర్ హనుమంతరావు శ్రీకారం
హైదరాబాద్, వెలుగు: దేవాదాయ శాఖలో ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభించనుంది. అర్చకులు, ఆలయ ఉద్యోగులు, సామాన్య ప్రజలు తమ సమస్యల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేకుండా.. దేవాదాయ శాఖ నూతన డైరెక్టర్ హనుమంతరావు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శాఖాపరమైన సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం ‘ధర్మవాణి’పేరుతో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి డైరెక్టర్ కార్యాలయంలో ఈ ప్రోగ్రామ్ జరగనుంది.
శాఖలోని ఉద్యోగులు, అర్చకులు లేదా ఇతరులు ఎవరైనా నేరుగా డైరెక్టర్‌ను కలిసి సమస్యలను ఆఫీసర్ల దృష్టికి తీసుకురావచ్చు. స్వీకరించిన ఫిర్యాదుల్లో ధర్మబద్ధమైన సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించనున్నారు. ఒకవేళ ఫైల్ పరిశీలన అవసరమైతే గరిష్టంగా వారం రోజుల టైమ్ తీసుకుంటారు. ఈ వారం రోజుల్లోనే సమస్యను క్లియర్ చేసి దరఖాస్తుదారుడికి ఆఫీస్ నుంచే ఫోన్ చేసి సమాచారం అందిస్తారు.
ఒకవేళ ఏదైనా కారణంతో సమస్య పరిష్కారం కాకపోతే, ఎందుకు సాధ్యం కాదో కూడా వివరణ ఇస్తామని డైరెక్టర్ హనుమంతరావు తెలిపారు. కేవలం హెడ్ ఆఫీస్ సమస్యలే కాకుండా రాష్ట్రంలోని డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యాలయాల్లో చేయాల్సిన పనులను, చేయని పనులను కూడా ఈ ధర్మవాణి ద్వారా పరిష్కరిస్తామని వెల్లడించారు. కిందిస్థాయిలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను కూడా నేరుగా డైరెక్టర్ దృష్టికి తీసుకురావచ్చని ఆయన సూచించారు.
