- సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొత్త చట్టం చేసిన రాష్ట్రం
- అట్లా వచ్చిన ఆదాయం రోడ్డు సేఫ్టీ కోసం ఖర్చు
- రవాణా శాఖకు ఏటా సమకూరనున్న రూ.350 కోట్లు
హైదరాబాద్, వెలుగు: ఇయ్యాల్టి నుంచి రాష్ట్రంలో కొత్తగా కొనుగోలు చేసే అన్ని రకాల వాహనాలపై రోడ్ సేఫ్టీ ట్యాక్స్ (రోడ్డు భద్రత పన్ను) చెల్లించాల్సి ఉంటుంది. టూ వీలర్లకు రూ.2 వేలు, కార్లు ఇతర లైట్ మోటర్ వెహికల్స్‌కు రూ.5 వేలు, త్రీ వీలర్ ఆటోలతో పాటు ఇతర ట్రాన్స్‌పోర్టు వెహికల్స్ రూ.10 వేలు ఈ పన్నును చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును పాస్ చేసింది. మార్చి 1 నుంచి అమల్లోకి రానుంది.
దీనికి సంబంధించిన జీవోను రాష్ట్ర రవాణా శాఖ శుక్రవారం విడుదల చేసింది. ఈ పన్ను వసూలుపై సంబంధిత శాఖ అధికారులు ఇప్పటికే అన్ని రకాల చర్యలు చేపట్టారు. ఈ పన్నుల ద్వారా ప్రతి ఏటా రాష్ట్ర రవాణా శాఖకు సుమారు రూ.350 కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
రోడ్డు ప్రమాదాల్లో మరణాలను అరికట్టేందుకు, రోడ్లపై ప్రయాణించే వారికి మెరుగైన వసతులు కల్పించాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. మోటర్ వెహి కల్స్ చట్టంలో సవరణలు చేశారు. దీంతో అన్ని రాష్ట్రాలు డెడికేటెడ్ రోడ్డు సేఫ్టీ ఫండ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం తెలంగాణ కూడా ఇప్పుడు ఈ ట్యాక్స్ ద్వారా వచ్చే మొత్తాన్ని రోడ్డు భద్రతకు ఖర్చు చేయనుంది. రాష్ట్రంలో ఏటా 7 లక్షల కొత్త టూ వీలర్లు, లక్ష వరకు కార్లు, మరో రెండున్నర లక్షలు ఇతర వెహికల్స్ కొనుగోళ్లు జరుగుతున్నాయి.
