టీ20 వరల్డ్ కప్ సెమీస్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ కోసం ఇండియా టీమ్ రెడీ అయింది. ఆదివారం జరిగే సూపర్-8 మ్యాచ్‌లో భారీ హిట్టర్లతో భయపెడుతున్న వెస్టిండీస్‌తో తలపడనుంది. ఇందులో ఎవరు గెలిస్తే వాళ్లే ముందుకెళ్లే చాన్స్ ఉండటంతో ఇరుజట్లకు ఇది చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌గా మారింది.
కోల్‌కతా: టీ20 వరల్డ్ కప్ సెమీస్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ కోసం ఇండియా టీమ్ రెడీ అయ్యింది. ఆదివారం జరిగే సూపర్–8 మ్యాచ్‌లో భారీ హిట్టర్లతో భయపెడుతున్న వెస్టిండీస్‌తో తలపడనుంది. ఇందులో ఎవరు గెలిస్తే వాళ్లే ముందుకెళ్లే చాన్స్ ఉండటంతో ఇరుజట్లకు ఇది చావోరేవో మ్యాచ్‌గా మారింది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌తో టీమిండియా బ్యాటింగ్ బలం బాగా పుంజుకున్నా.. బౌలింగ్‌లో మాత్రం అక్కడక్కడా లోపాలు కనిపిస్తున్నాయి. సంజూ శాంసన్ ఓపెనర్‌గా రావడంతో టాప్–6 బ్యాటర్లందరూ కుదురుకున్నారు. అభిషేక్‌తో కలిసి శాంసన్ మరోసారి మెరుపు ఆరంభాన్నిస్తే భారీ స్కోరును ఆశించొచ్చు.
ఇషాన్ కిషన్, సూర్యకుమార్ కూడా బ్యాట్లు ఝుళిపించడం కోసం ఎదురుచూస్తున్నారు. ఆరో నంబర్‌లో తిలక్ వర్మ భారీ హిట్టింగ్‌తో ఇన్నింగ్స్‌కు కొత్త ఊపు తెచ్చాడు. తండ్రి మరణంతో సొంతూరికి వెళ్లిన రింకూ సింగ్ జట్టుతో కలిసినా మ్యాచ్ ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. బౌలింగ్‌లో మిస్టరీ లెగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సత్తా చాటాల్సి ఉంది. షార్ట్ లెంగ్త్‌తో ఇబ్బందిపడుతున్న అతని బౌలింగ్‌లో సఫారీ బ్యాటర్లు మిల్లర్, బ్రెవిస్ పరుగుల వరద పారించారు.
అయితే వరుణ్ ప్లేస్‌లో కుల్దీప్‌కు చాన్స్ ఇస్తారేమో చూడాలి. సీమ్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే మెరుగుపడాల్సి ఉంది. జింబాబ్వేతో మ్యాచ్‌లో కేవలం రెండు ఓవర్లలోనే 46 రన్స్ ఇచ్చాడు. ఈడెన్ పిచ్‌పై కొద్దిగా పచ్చిక ఉంది. పేసర్లకు అనుకూలమని వార్తలు వస్తున్న నేపథ్యంలో బుమ్రా, అర్ష్‌దీప్, పాండ్యా కీలకం కానున్నారు.
హిట్టింగ్‌పైనే దృష్టి..
ఈ టోర్నీలో విండీస్ స్పష్టమైన ప్రణాళికతో ఆడుతున్నది. స్టార్టింగ్ నుంచే బ్యాటర్లందరూ భారీ హిట్టింగ్‌తో అదరగొడుతున్నారు. ఈ స్ట్రాటజీతోనే ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గారు. సౌతాఫ్రికా మాత్రమే కరీబియన్లకు అడ్డుకట్ట వేసింది. ఇప్పుడు ఇండియా కూడా సఫారీలను అనుసరించాల్సిందే. బ్రెండన్ కింగ్, షై హోప్, రొమారియో షెపర్డ్, హెట్‌మయర్, పావెల్, ఛేజ్ రూథర్‌ఫోర్డ్ హిట్టింగ్‌ను అడ్డుకుంటేనే ఇండియా విజయాన్ని ఆశించొచ్చు.
లెఫ్టార్మ్ స్పిన్నర్ అకిల్ హుస్సేన్ తుది జట్టులోకి వచ్చే చాన్స్ ఉంది. గుడకేశ్ మోతీ, హోల్డర్, మాథ్యూ ఫోర్డ్‌పై ఎక్కువ భారం పడనుంది. 1983 తర్వాత ఈడెన్‌లో వెస్టిండీస్ ఏ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లోనూ ఇండియాను ఓడించలేదు. రెండు మ్యాచ్‌లను డ్రా చేసుకోగా, నాలుగు టీ20లతో సహా 9 మ్యాచ్‌ల్లో ఓడింది. ఇక 2016 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత విండీస్ ఏ ఐసీసీ ఈవెంట్‌లోనూ సెమీస్‌కు చేరుకోలేదు. ఇప్పుడు ఈ రెండు రికార్డులు కరీబియన్లకు ప్రతికూలంగా మారనున్నాయి.
జట్లు (అంచనా)
ఇండియా: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్, శాంసన్, ఇషాన్, తిలక్, హార్దిక్, శివమ్ దూబే, అక్షర్, అర్ష్‌దీప్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
వెస్టిండీస్: షై హోప్ (కెప్టెన్), బ్రెండన్ కింగ్, షిమ్రన్ హెట్‌మయర్, రొవ్‌మన్ పావెల్, రోస్టన్ ఛేజ్, రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డ్, గుడకేశ్ మోతీ, షమర్ జోసెఫ్.
పిచ్, వాతావరణం
పిచ్ పొడిగా ఉంది. భారీ హిట్టింగ్‌కు అనుకూలం. స్పిన్నర్లు కూడా ప్రభావం చూపొచ్చు. వర్షం పడే చాన్స్ లేదు.
