
క్లౌడ్ బరస్ట్. 2025లో ఎక్కువగా చర్చకొస్తున్న వాతావరణ మార్పుల్లో క్లౌడ్ బరస్ట్ ప్రధానమైంది. ఈ క్లౌడ్ బరస్ట్ కారణంగా జల ప్రళయం సంభవించి కళ్ల ముందే ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకుపోయిన దుర్భర పరిస్థితులను 2025లో ఎక్కువగా చూస్తున్నాం. జమ్ము కశ్మీర్లో, ఉత్తరాఖండ్లో, మహారాష్ట్రలో.. అంతెందుకు ఈ మధ్య చాలా సందర్భాల్లో క్లౌడ్ బరస్ట్ అయి హైదరాబాద్ నగరంలో కూడా కుంభవృష్టి కురిసింది. భారీ వర్షాలు కురవడం వేరు, క్లౌడ్ బరస్ట్ వేరు. ఒక పావు గంటనో, అర గంటనో కాదు.. ఆకాశానికి చిల్లు పడిందేమో అనేంతగా కొన్ని గంటల పాటు భారీ వర్షం, వరదలు ముంచెత్తితే అందుకు కారణం క్లౌ్డ్ బరస్ట్ అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
అసలు ఇంతకీ ఈ క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి..? క్లౌడ్ బరస్ట్ అనేది ఆంగ్ల పదం కాబట్టి అందరికీ అర్థం కాదేమో గానీ క్లౌడ్ బరస్ట్ అనేది మనకు తెలియని విషయం ఏం కాదు. క్లౌడ్ అంటే మేఘాలు. బరస్ట్ అంటే విస్ఫోటం. మొత్తంగా క్లౌడ్ బరస్ట్ అంటే మేఘాల విస్ఫోటం. ఇది జరిగితే ఉరుములు, పిడుగులతో ఊహించని స్థాయిలో భారీ వర్షాలు కురుస్తాయి. దాదాపు 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల పరిధిలో గంటకు 10 సెంటీమీటర్ల (100 మి.మీ) వర్షపాతం నమోదవుతుంది. ఏదైనా ఒక నిర్దిష్ట ప్రాంతంలో రెండు గంటల వ్యవధిలోనే 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే క్లౌడ్ బరస్ట్గా వ్యవహరిస్తారు. కేవలం ఒక గంట లోపు 10 సెం.మీ కుండపోత వర్షం 30 ఘనపు కి.మీ వైశాల్యంలో మాత్రమే కురవడాన్ని క్లౌడ్ బరస్ట్‌గా వాతావరణ శాఖ పేర్కొంది.
హైదరాబాద్ నగరంలో బుధవారం (సెప్టెంబర్ 17) ఈ క్లౌడ్ బరస్ట్ కారణంగానే వర్షం దంచికొట్టింది. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి నగర శివార్లలో వర్షం కురవగా, కోర్ సిటీలో 6.30 గంటల నుంచి అర్ధరాత్రి వరకు నాన్‌స్టాప్ గా వాన పడుతూనే ఉంది. ముషీరాబాద్లో అత్యధికంగా 18.43 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైతేనే క్లౌడ్ బరస్ట్ అంటారు అలాంటిది 18.43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే హైదరాబాద్ సిటీలో ఈ క్లౌడ్ బరస్ట్ ప్రభావం ఎంత తీవ్ర స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ALSO READ : సంగారెడ్డి జిల్లా ప్రజలకు అలర్ట్..
మనదేశంలో ఏటా వర్షాకాలం సమయంలో హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్, ఉత్తరాఖండ్లలోని ఎత్తైన ప్రదేశాల్లో పలుచోట్ల క్లౌడ్ బరస్ట్ సంభవిస్తుంటుంది. కాశ్మీర్ లోయలోని కిశ్త్‌నాడ్ ప్రాంతంలో సంభవించిన క్లౌడ్ బరస్ట్ విపత్తులో 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మిగతా రాష్ట్రాల్లోనూ అడపాదడపా క్లౌడ్ బరస్ట్ సంభవించిన దాఖలాలు ఉన్నప్పటికీ.. పెద్దగా ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లలేదు. కానీ.. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ క్లౌడ్ బరస్ట్ తరచుగా సంభవిస్తుండటం ఆందోళన కలిగించే విషయం.
వాతావరణ శాఖ క్లౌడ్ బరస్ట్ను ముందస్తుగా కచ్చితమైన అంచనా వేయడం సాధ్యం కావడం లేదు. వాతావరణ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల అనేక అనర్థాలు, అందులో క్లౌడ్ బరస్ట్ కూడా ఒకటి. అందువల్ల.. ఇలాంటి ఉపద్రవాలు సంభవించకుండా ఉండాలంటే.. వాతావరణం వేడెక్కకుండా చూసుకోవాలి. కాలుష్య నివారణకు మన వంతు కృషి చేయడమే ఇందుకు ఏకైక మార్గం.