ఐశ్వర్య - అభిషేక్ విడాకుల పుకార్లు.. నిజాన్ని బయటపెట్టిన సన్నిహితుడు!

ఐశ్వర్య - అభిషేక్ విడాకుల పుకార్లు.. నిజాన్ని బయటపెట్టిన సన్నిహితుడు!

బాలీవుడ్‌లో అత్యంత ఆకర్షణీయమైన జంటల్లో  ఒకటిగా ఐశ్వర్య రాయ్ బచ్చన్ , అభిషేక్ బచ్చన్ దంపతులకు పేరు ఉంది. అయితే వీరి  గురించి నిరంతరం ఏదో ఒక పుకారు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ముఖ్యంగా వారిద్దరి మధ్య విభేదాలు, విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.  ఈ పుకార్లపై ఈ దంపతులు ఎప్పుడూ ఖండించింది లేదు. 

అయితే, ఈ పుకార్లన్నీ నిరాధారమైనవని, వారి బంధం బలంగానే ఉందని పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల, ప్రముఖ అడ్వర్టైజింగ్ గురువు ప్రహ్లాద్ కక్కర్ ఓ ఇంటర్వ్యూలో ఈ పుకార్లపై స్పందిస్తూ అసలు విషయాన్ని బయటపెట్టారు. ఐశ్వర్య బచ్చన్ ఇల్లు వదిలిపెట్టి వెళ్లలేదని, ఆమె తల్లి అనారోగ్యం కారణంగా వారి దగ్గర ఎక్కువ సమయం గడుపుతున్నారని తెలిపారు. 

ప్రతిరోజూ ఉదయం తన కుమార్తెను ఆరాధ్యను స్కూల్లో దింపిన తర్వాత, మళ్లీ తీసుకురావడానికి మధ్య ఉన్న మూడు గంటల సమయాన్ని ఐశ్వర్య తన తల్లితో గడుపుతారు. ఆ తర్వాత మళ్లీ బచ్చన్ ఇంటికే వెళ్తారు అని కక్కర్ వివరించారు. ఈ వివరణతో బచ్చన్ జంట మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టమైంది. అంతేకాకుండా  ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు కూడా ఈ పుకార్లను పటాపంచలు చేశాయి.

 ఈ ఏడాది ఏప్రిల్‌లో పుణెలో జరిగిన ఐశ్వర్య కజిన్ పెళ్లికి బచ్చన్ జంట తమ కుమార్తె ఆరాధ్యతో కలిసి హాజరయ్యారు. ఆ వేడుకలో తీసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అంతేకాకుండా, అంతకుముందు ఆరాధ్య స్కూల్ ఫంక్షన్‌లోనూ, డిసెంబర్‌లో జరిగిన ఒక స్టార్ వెడ్డింగ్ రిసెప్షన్‌లోనూ వారంతా కలిసే కనిపించారు. ఆరాధ్య పుట్టినరోజు వేడుకలను కూడా కుటుంబమంతా కలిసి ఘనంగా జరుపుకున్నారు.

గతేడాది ఒక హై-ప్రొఫైల్ పెళ్లికి వీరు వేర్వేరుగా రావడం, అభిషేక్ "గ్రే డైవోర్స్" గురించి ఉన్న ఒక సోషల్ మీడియా పోస్ట్‌కు లైక్ కొట్టడం వంటివి విడాకుల పుకార్లకు దారితీశాయి. అయితే, వీటిని కొన్ని మాధ్యమాలు కావాలనే తప్పుడు కోణంలో ప్రచారం చేశాయని బచ్చన్ కుటుంబానికి సన్నిహితులు చెబుతున్నారు. ఈ జంట ఎన్ని పుకార్లను ఎదుర్కొన్నా, వారి బంధం మాత్రం చాలా బలంగా ఉందని, వారి కుటుంబం సంతోషంగా ఉందని వారి సన్నిహితులు అంటున్నారు.