నలుగురు పోకిరీలు ఒక చోట చేరితే ఎంత వీరవిహారం చేస్తారో చెప్పనవసరం లేదు. గట్టిగా అరుస్తూ.. కేకలు వేస్తూ.. ఆందోళనకు గురిచేస్తుంటారు. తిరుపతిలో గురువారం (సెప్టెంబర్ 18) రాత్రి కూడా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.
తిరుపతిలో రాత్రి పోకిరీలు వీరవిహారం చేశారు. ఫుల్లుగా తాగి రోడ్లపై అసభ్యకరంగా ప్రవర్తించారు. రోడ్లపై వెళ్తున్న మహిళలపై వెకిలి కామెంట్లు చేశారు. బార్లు, వైన్స్ ల వద్ద హంగామా సృష్టించి స్థానికులను భయాందోళనకు గురిచేశారు. అడ్డువచ్చిన వారిని బెదిరించే ప్రయత్నం చేశారు.
మొదట కరకంబాడి లో పీకల్లోతు తాగి అరుస్తూ.. అక్కడే మద్యం సేవిస్తున్న ముగ్గురిపై దాడికి దిగారు. ప్రశ్నించిన వారిపై ఎదురు దాడికి దిగి హల్ చల్ చేశారు. ఆ తర్వాత కరకంబాడి నుంచి నేరుగా అమెరికన్ బార్ దగ్గరకు చేరుకొని వెకిలి చేష్టలు చేశారు.
అంతటితో ఆగకుండా.. రోడ్డుపై వెళ్తున్న వారిపై ఈవ్ టీజింగ్ చేస్తూ.. అసభ్యకరంగా ప్రవర్తించారు. మత్తులో వీరవిహారం చేయడంతో స్థానికులు భయంతో పరిగెత్తారు. దీంతో చిరాకెత్తి స్థానికులు యువకులను పట్టుకునే క్రమంలో ముగ్గురు పారిపోయారు. దొరికిన ముగ్గురిని రోడ్డుపై పడేసి చితకబాదారు. పోలీసులకు సమాచారం ఇచ్చి యువకుల్ని పట్టించారు. ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.
