
ఇండియాతో హ్యాండ్ షేక్ వివాదం తర్వాత పాకిస్థాన్ ఆసియా కప్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో బుధవారం (సెప్టెంబర్ట్ 17) యూఏఈతో మ్యాచ్‌ను బహిష్కరించాలని పాకిస్తాన్ నిర్ణయించింది. ఇందులో భాగంగానే పీసీబీ జాతీయ జట్టు సభ్యులను హోటల్‌లోనే ఉండాలని,యుఎఇతో జరిగే మ్యాచ్ కోసం వేదికకు వెళ్లొద్దని ఆదేశించినట్లు సమాచారం. ఆటగాళ్లను వారి హోటల్ గదుల్లోనే ఉండమని చెప్పడంతో 8 గంటలకు జరగాల్సిన మ్యాచ్ కు యూఏఈ జట్టు వచ్చినా పాకిస్థాన్ స్టేడియానికి రాలేదు. దీంతో మ్యాచ్ కు ముందు కాసేపు హై డ్రామా నడించింది.
పాకిస్థాన్ అనూహ్యంగా తమ నిర్ణయాన్ని మార్చుకొని యూఏఈతో మ్యాచ్ ఆడడానికి సిద్ధమైంది. అప్పటివరకు మ్యాచ్ ఆడకూడదని నిర్ణయించుకున్న పాకిస్థాన్ సడన్ మనసు మార్చుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఒకవేళ పాకిస్థాన్ యూఏఈతో మ్యాచ్ ఆడకుండా టోర్నీ నుంచి వెళ్ళిపోతే ఆ జట్టు దాదాపు రూ. 140 కోట్ల నష్టాన్ని చవి చూడాల్సి వచ్చేది. పాకిస్థాన్ టోర్నీ నుంచి వైదొలిగితే ఐసీసీకి రూ. 140 కోట్లు చెల్లించాల్సి వచ్చేది. అసలే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆర్ధికంగా చాలా నష్టాల్లో ఉంది. ఈ సమయంలో టోర్నీ ఆడకుండా రూ.140 కోట్లు చెల్లించడానికి వెనకడుగు వేసింది.
ALSO READ : Asia Cup 2025: ఒక్క మ్యాచ్‌తో మూడు జట్ల భవితవ్యం.. గ్రూప్-బి సూపర్-4 లెక్కలు ఇవే
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) వార్షిక ఆదాయంలో 75 శాతం టెస్ట్ ఆడే ఐదు దేశాలు ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య సమానంగా పంపిణీ చేయబడుతుంది. అంటే ప్రతి దేశానికి ఆదాయంలో 15 శాతం లభిస్తుంది. మిగిలిన 25 శాతం అసోసియేట్ సభ్య దేశాలకు పంపిణీ చేయబడుతుంది. ఈ ఆదాయం ప్రసార హక్కులు (టీవీ, డిజిటల్), స్పాన్సర్లు, టిక్కెట్ల అమ్మకాలు వంటి వివిధ వనరుల నుండి వస్తుంది. ఈ ఆసియా కప్ నుండి మాత్రమే, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు దాదాపు 12 నుండి 16 మిలియన్ యూ ఎస్ డాలర్లు (₹140 కోట్లు) సంపాదిస్తుంది అని అంచనా. ఇలాంటి పరిస్థితిలో పాకిస్తాన్ టోర్నమెంట్ నుండి వైదొలిగితే వారికి ఆర్ధికంగా ఎదురు దెబ్బ తగలడం ఖాయం.
బుధవారం (సెప్టెంబర్ 17) యూఏఈతో జరిగిన 41 రన్స్ తేడాతో గెలిచి పాకిస్థాన్ సూపర్–4 రౌండ్‌కు క్వాలిఫై అయింది. ఆదివారం మరోసారి ఇండియాను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 146/9 స్కోరు చేసింది. ఫఖర్ జమాన్ (50) ఫిఫ్టీ కొట్టగా.. చివర్లో షాహీన్ షా ఆఫ్రిది (29 నాటౌట్) మరోసారి మెరుపులు మెరిపించాడు. యూఏఈ పేసర్ జునైద్ సిద్దిఖీ (4/18), స్పిన్నర్ సిమ్రన్ జీత్ సింగ్ (3/26) సత్తా చాటారు. అనంతరం ఛేజింగ్‌లో యూఏఈ 17.4 ఓవర్లలో 105 రన్స్‌కు ఆలౌటైంది. రాహుల్ చోప్రా (35), ధ్రువ్ పరాస్కార్ (20) పోరాడినా ఓటమి తప్పలేదు. పాక్ బౌలర్లలో షాహీన్, అబ్రార్, రవూఫ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.