
ఆసియా కప్ లో భాగంగా గురువారం (సెప్టెంబర్ 18) గ్రూప్-బి లో చివరి మ్యాచ్ జరగనుంది. అబుదాబి వేదికగా షేక్ జాయెద్ స్టేడియంలో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లు కీలక మ్యాచ్ కోసం సిద్ధమవుతున్నాయి. గ్రూప్-ఏ లో ఇప్పటికే ఇండియా, పాకిస్థాన్ సూపర్-4 కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. గ్రూప్-బి లో మాత్రం ఇంకా ఒక్క జట్టు కూడా సూపర్-4 కు అర్హత సాధించకపోవడం ఆసక్తికరంగా మారింది. శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ తో గ్రూప్-లో సూపర్-4 కు చేరే జట్లేవో నేడే తెలిసిపోతుంది. గ్రూప్-బి లెక్కలు ఎలా ఉన్నాయో.. ఏ జట్టు సూపర్-4కు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
గ్రూప్-బి లో హాంకాగ్ ఇప్పటికే మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రయించింది. రెండు స్థానాల కోసం బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక జట్లు పోటీ పడుతున్నాయి. బంగ్లాదేశ్ ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెండు విజయాలు సాధించి సూపర్-4 రేస్ లో ఉంది. మరోవైపు శ్రీలంక ఆడిన రెండు మ్యాచ్ ల్లో విజయం సాధిస్తే.. ఆఫ్ఘనిస్తాన్ రెండు మ్యాచ్ లో ఒకటి గెలిచింది. నేడు జరగనున్న మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధిస్తేనే సూపర్ -4 కు చేరుతుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం ఇంటిదారి పడుతుంది. ఆఫ్ఘనిస్తాన్ కు ఇది డూ ఆర్ డై మ్యాచ్.
బంగ్లాదేశ్ సూపర్-4 కు అర్హత సాధించాలంటే రెండు దారులు ఉన్నాయి. ఒకటి శ్రీలంక చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోవాలి. అదే జరిగితే శ్రీలంక, బంగ్లాదేశ్ తదుపరి రౌండ్ కు చేరుకుంటాయి. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ పై 70 పరుగుల తేడాతో శ్రీలంక ఓడిపోతే అప్పుడు నెట్ రన్ రేట్ తో బంగ్లా సూపర్-4కు వెళ్తుంది. ఇక శ్రీలంక విషయానికి వస్తే మిగిలిన రెండు జట్ల కంటే మెరుగైన అవకాశాలు ఉన్నాయి.
ALSO READ : చక్రవర్తి బౌలర్ నం.1.. తొలిసారి నంబర్ వన్ ర్యాంక్ సొంతం
ఆఫ్ఘనిస్తాన్ పై గెలిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా సూపర్-4 కు వెళ్తుంది. ఒకవేళ ఓడిపోయినా లంక జట్టుకు ఛాన్స్ ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో భారీ తేడాతో అంటే 70 పరుగులతో ఓడిపోకుండా చూసుకోవాలి. ఒకవేళ ఈ మ్యాచ్ లో శ్రీలంక ఓడిపోయినా 70 పరుగుల తేడాతో అయితే ఓడిపోదనే చెప్పాలి. సమీకరణాలు గమనిస్తే శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్ లేదా ఆఫ్ఘనిస్తాన్ జట్లలో ఒక జట్టు సూపర్-4 కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.