యాప్ డిజైన్‌‌లో.. హైదరాబాద్‌‌ను గ్లోబల్ లీడర్‌‌గా నిలబెడతాం: భట్టి విక్రమార్క

యాప్ డిజైన్‌‌లో.. హైదరాబాద్‌‌ను గ్లోబల్ లీడర్‌‌గా నిలబెడతాం: భట్టి విక్రమార్క
హైదరాబాద్, వెలుగు : యాప్ డిజైన్‌‌లో హైదరాబాద్‌‌ను గ్లోబల్ లీడర్‌‌గా నిలబెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. యుఎం వో ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్‌‌లో ప్రారంభమైన "యూఎక్స్ ఇండియా 25" అంతర్జాతీయ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన ఈ 21వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ యూజర్ ఎక్స్‌‌పీరియన్స్ అండ్ ప్రొడక్ట్ డిజైన్‌‌ను లాంఛనంగా ప్రారంభించారు.

ఏఐ టెక్నాలజీకి గ్లోబల్ సెంటర్‌‌గా హైదరాబాద్

ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీకి హైదరాబాద్‌‌ను గ్లోబల్ సెంటర్‌‌గా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు తమ క్యాబినెట్ పట్టుదలతో ఉందని డిప్యూటీ సీఎం అన్నారు. డిజైన్ అనేది కేవలం అందానికి మాత్రమే కాకుండా సామాజిక మార్పుకు ఒక ఆయుధంగా ఉండాలని ఆయన ఉద్బోధించారు. తెలంగాణ ప్రభుత్వం సమానత్వం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని, హైదరాబాద్‌‌ను ప్రపంచ డిజైన్ క్యాపిటల్‌‌గా మార్చడానికి అందరూ కలిసి పని చేద్దామని ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులకు పిలుపునిచ్చారు. అలాగే, ఈ సదస్సు హైదరాబాద్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు. ఈ రోజుల్లో యాప్‌‌లు మన జీవితంలో ఒక భాగం అయ్యాయని, కానీ ఒక యాప్ విజయవంతం కావాలంటే అది యూజర్ ఫ్రెండ్లీగా ఉండటం తప్పనిసరి అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ ఇంక్లూజన్‌‌ను ప్రోత్సహిస్తుందని, టీఎస్-ఐపాస్ వంటి పాలసీల ద్వారా స్టార్టప్‌‌లకు చేయూతనిస్తుందని తెలిపారు. ప్రాంతీయ భాషల్లో యాప్‌‌లు రూపొందిస్తే గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా వాటిని సులభంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

త్వరలో 'సెంటర్ ఆఫ్ ఎక్స్‌‌లెన్స్ ఇన్ డిజైన్': మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్‌‌ను గ్లోబల్ డిజైన్ హబ్‌‌గా మార్చాలనే లక్ష్యంతో త్వరలోనే సెంటర్ ఆఫ్ ఎక్స్‌‌లెన్స్ ఇన్ డిజైన్ ను ప్రారంభించనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. టీ-హబ్, టీ-వర్క్స్, వీ-హబ్ వంటి సంస్థల ద్వారా తెలంగాణను ఇన్నోవేషన్ హబ్‌‌గా మార్చడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన వివరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోయే ఏఐ ఇన్నోవేషన్ హబ్లో డిజైనింగ్‌‌కు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. డిజైనింగ్ అంటేనే సృజనాత్మకత అని, అది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటేనే ఆ యాప్ లేదా వెబ్‌‌సైట్ మనుగడ సాధ్యమని మంత్రి అన్నారు. కొత్త ఆలోచనలతో ముందుకొచ్చే స్టార్టప్‌‌లకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తుందని పేర్కొన్నారు.