అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు : ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు : ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
  • ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు: ఇండ్లు లేని ప్రతి నిరుపేదకు పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతీ ఒక్కరికి దశలవారీగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు. శుక్రవారం యాదగిరిగుట్టలోని పోచమ్మవాడకు చెందిన లబ్ధిదారులు రహీం రజియా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు పట్టువస్త్రాలు పెట్టి యాటపోతును కానుకగా ఇచ్చారు. 

అనంతరం మాట్లాడుతూ.. డబుల్ బెడ్​రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పి పదేళ్లు ఊరించిన మాజీ సీఎం కేసీఆర్ ఒక్కరికైనా పక్కా ఇల్లు ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందని గుర్తుచేశారు. ప్రతీ ఏడాది నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్ల చొప్పున మంజూరు చేసి ప్రతి పేదోడికి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పారు.

 రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు సర్పంచ్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే నిదర్శనమని, రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా ఇదే ఫలితాలు రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ గుండ్లపల్లి భరత్ గౌడ్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, మండల నాయకుడు గౌలీగార్ రాజేశ్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ సలాం, వడ్డెర సంఘం అధ్యక్షుడు బాలయ్య పాల్గొన్నారు.