పశువుల్లా ప్రవర్తించకండి: కచేరీలో ఉద్రిక్తత.. అభిమానులపై సింగర్ కైలాష్‌ ఖేర్‌ ఫైర్

పశువుల్లా ప్రవర్తించకండి: కచేరీలో ఉద్రిక్తత.. అభిమానులపై సింగర్ కైలాష్‌ ఖేర్‌ ఫైర్

‘‘సింగర్ కైలాష్ ఖేర్’’(Kailash Kher).. సినీ శ్రోతలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. విలక్షణమైన గొంతుతో ఇండియాలో టాప్ సింగర్గా రాణిస్తున్నారు. ఉత్తమ ప్లేబ్యాక్ మేల్ సింగర్గా రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు మరెన్నో పురస్కారాలు సాధించారు. 2017 లో పద్మశ్రీ అవార్డును సైతం అందుకున్నారు. ఆయనకు ఉన్న తన విలక్షణమైన గొంతే తన అసలైన ఆస్తి అని ఖేర్ భావిస్తారు.

ఈ క్రమంలోనే  "సింగర్ కైలాష్ ఖేర్"కు భారతదేశమంతటా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. కైలాష్ ఖేర్ ఏదేని కచేరి ఏర్పాటుచేస్తే జనాలు తండోపతండాలుగా హాజరై, తన పాటలని ఆస్వాదిస్తారు. అలా విశేషణమైన అభిమానులను సొంతం చేసుకున్న కైలాష్ ఖేర్.. తాజాగా ఓ ప్రోగ్రాంలో అసహనం వ్యక్తం చేశారు. అత్యుత్సాహం ప్రదర్శించిన కొందరు అభిమానులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. 

దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా (డిసెంబర్ 25న) గ్వాలియర్‌లో కాన్సర్ట్‌ నిర్వహించారు సింగర్ కైలాష్ ఖేర్. ఈ సందర్భంగా కైలాష్ ఖేర్ పాటలు పాడేటపుడు, ఉన్నట్టుండి పలువురు అభిమానులు బారికేడ్లు దూకి మరీ, వేదిక వద్దకు వెళ్లేందుకు యత్నించారు. ఈ పరిస్థితిని చాలా శాంతియుతంగా కంట్రోల్ చేయడానికి  కైలాష్ ఖేర్ ప్రయత్నించాడు. కానీ, ప్రేక్షకులు అల్లకల్లోలంగా మారి బారికేడ్లను పదే పదే దూకడంతో, కచేరీని అకస్మాత్తుగా ఆపేశాడు.

ఈ క్రమంలో  ‘‘ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఎవరైనా మా దగ్గరికి లేదా మా సంగీత పరికరాల వద్దకు వస్తే షోని పూర్తిగా నిలిపివేస్తాం. మేము మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాము. అయితే, ఈ సమయంలో, మీరు పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. దయచేసి పశువుల్లా ప్రవర్తించడం ఆపండి’’అని హెచ్చరించారు. ఈ దృశ్యాలు, వీడియోలో వైరల్ అవుతున్నాయి. అలాగే, సీనియర్ పోలీసు అధికారులు మరియు భద్రతా సిబ్బంది జోక్యం చేసుకోవాలని ఖేర్ కోరారు. కానీ, ప్రేక్షుకుల క్రౌడ్ ఎక్కువయ్యేసరికి భద్రతా ఏర్పాట్లు సైతం కట్టడిచేయలేకపోయింది. దీంతో గందరగోళం పెరిగి భద్రతా సమస్యలు పెరగడంతో, ఖేర్ మరియు అతని టీమ్ కచేరి నిలిపివేసి వేదిక నుండి వెళ్లిపోయారు.

ఇకపోతే, గతంలోనూ కర్ణాటకలో సింగర్ కైలాష్ ఖేర్కు చేదు అనుభవం ఎదురైంది. హంపీలో ఆయనపై పలువురు యువకులు దాడికి పాల్పడ్డారు. 2023 హంపీ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సంగీత కచేరిలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన స్టేజ్ పై పాటలు పాడుతుండగా కొందరు యువకులు ఆయనపై వాటర్ బాటిల్ విసిరారు. అయితే ఖేర్ మాత్రం ఇవేమి పట్టించుకోకుండా తన ప్రదర్శనను కొనసాగించారు. బాటిల్ విసిరిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కన్నడ పాటలు పాడనందుకే వారు బాటిల్ విసిరారని చెప్పారు.

కైలాష్ ఖేర్ పాడిన తెలుగు పాటలు:కమ్ముకున్న చీకటిలోనా (అరుంధతి)
పండగలా (మిర్చి)
వచ్చాడయ్యా స్వామి (భరత్ అను నేను)
కథానాయక (ఎన్టీఆర్ బయోపిక్)
‘ప్రయత్నమే తొలి విజయం’(చిత్ర లహరి)
అల్లా నేస్తమా (జీనియస్)
ప్రాణం కన్నా ప్రేమించినా (లవ్ రెడ్డి)
మత్తగజమే (రుద్రమదేవి)
రుద్రంగి టైటిల్ సాంగ్ (రుద్రంగి)
అమ్మ ఎవరో (మెకానిక్)
ఇటీవలే ‘అఖండ 2’లో ‘ది తాండవం’ సాంగ్ పాడారు.