మంథని, వెలుగు : పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. మంథని రేంజ్‌లోకి శుక్రవారం తెల్లవారుజామున ఓ పులి ప్రవేశించినట్లు ఫారెస్ట్ ఆఫీసర్లు వెల్లడించారు. గోదావరి నది తీరాన ఖాన్‌సాయిపేట శివారులో పులి అడుగులను గుర్తించినట్లు ఫారెస్ట్ ఆఫీసర్ శివయ్య పేర్కొన్నారు. గోదావరి తీరంలోని ఖానాపూర్, ఎక్లాస్‌పూర్, ఖాన్‌సాయిపేట, ఆరెంద, మల్లారం, స్వర్ణపల్లి, అడవి సోమన్‌పల్లి గ్రామాల్లో రాత్రి వేళ రైతులు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ ఆఫీసర్లు సూచించారు. పులి ఎల్ మడుగు నుంచి అరేంద వైపు వెళ్లినట్టు ఆఫీసర్లు గుర్తించారు.
మట్టిమల్ల శివారులో చిరుత సంచారం
కోనరావుపేట, వెలుగు : కోనరావుపేట మండలంలోని వట్టిమల్ల అటవీ ప్రాంతానికి దగ్గర్లోని గ్రామ శివారులో చిరుత సంచారంతో స్థానికుల భయాందోళన చెందుతున్నారు. స్థానిక గొర్ల కాపరులకు గురువారం రాత్రి చిరుత పులి కనిపించడంతో భయంతో గ్రామంలోకి పరుగెత్తారు. చిరుత సంచారంతో శివారు ప్రాంతాల్లోని పొలాలకు వెళ్లేందుకు రైతులు, గ్రామస్తులు భయపడుతున్నారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు శుక్రవారం వట్టిమల్ల గొల్లపల్లి గ్రామ శివారులో పర్యటించి చిరుత పులి అడుగు జాడలను గుర్తించారు. గ్రామస్తులు ఒంటరిగా అటవీ ప్రాంతానికి వెళ్లొద్దని సెక్షన్ ఆఫీసర్ అన్వర్ హెచ్చరించారు.
