ఏ బ్రేక్‌ఫాస్ట్ ఎంత ఆరోగ్యకరం.. ఇడ్లీ-దోసకు ఎన్ని మార్కులంటే ?

ఏ బ్రేక్‌ఫాస్ట్ ఎంత ఆరోగ్యకరం.. ఇడ్లీ-దోసకు ఎన్ని మార్కులంటే ?

మనం రోజు ఉదయం చేసే టిఫిన్స్(Breakfast) కేవలం కడుపు నింపుకోవడానికే కాదు, ఆ రోజంతా మన ఆరోగ్యం ఎలా ఉంటుందో నిర్ణయించే అతి ముఖ్యమైన విషయం. కొంతమంది ఏదో అలవాటుగా తింటే, మరికొంతమంది టైం లేక దొరికింది తింటారు. కానీ డాక్టర్ల అభిప్రాయం ప్రకారం.. మనం ఉదయం ఏం తింటామనే దానిపైనే మన జీర్ణక్రియ, రోజంతా ఉండే శక్తి,  షుగర్ లెవల్స్ ఆధారపడి ఉంటాయి. ప్రముఖ డాక్టర్ మనకు తెలిసిన బ్రేక్‌ఫాస్ట్ రకాలను విశ్లేషించారు. మన పొట్ట ఆరోగ్యం, జీర్ణక్రియ, ఎనర్జీ లెవల్స్ మీద ఏ ఆహారం ఎలాంటి ప్రభావం చూపుతుందో వివరిస్తూ  వాటికి ర్యాంకులు కూడా ఇచ్చారు.

ఏ బ్రేక్‌ఫాస్ట్ ఎంత ఆరోగ్యకరం?
డాక్టర్ సేథి అభిప్రాయం ప్రకారం, ఉదయం మనం తినే ఆహారం ఆ రోజంతా మన జీర్ణక్రియ, శక్తి మరియు రక్తంలోని చక్కెర స్థాయిలను నిర్ణయిస్తుంది.

1. గుడ్లు (Eggs) - 10/10
 గుడ్లలో నాణ్యమైన ప్రోటీన్ ఉంటుంది. ఇది తింటే కడుపు నిండుగా అనిపిస్తుంది, శరీరానికి మంచి శక్తినిస్తుంది.

2. గ్రీకు పెరుగు (Greek Yogurt) - 9/10
ఇందులో ప్రోటీన్‌తో పాటు కడుపులోని మంచి బ్యాక్టీరియాకు మేలు చేసే 'ప్రోబయోటిక్స్' ఉంటాయి. అయితే చక్కెర లేని పెరుగు తీసుకోవడం మంచిదని సూచించారు.

3. వోట్స్, అవకాడో టోస్ట్, పనీర్ ఇంకా టోఫు - 8/10
వోట్స్ నెమ్మదిగా అరుగుతాయి, కాబట్టి రోజంతా శక్తి ఉంటుంది. పనీర్లో ఉండే ప్రోటీన్ ఆకలిని కంట్రోల్ లో ఉంచుతుంది. అవకాడో టోస్ట్ & టోఫు ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లను అందిస్తాయి.

4.  వేరుశెనగ వెన్న (Peanut Butter) - 7/10
పండ్లు ఎక్కువగా ఉన్న స్మూతీలు తాగితే షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదం ఉంది. అందుకే కూరగాయలు కలిపిన స్మూతీలు మేలు. వేరుశెనగ వెన్నను తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.

5. ఇడ్లీ & దోస - 6/10
మనకు ఎంతో ఇష్టమైన ఇడ్లీ, దోసలకు  6 మార్కులు మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే వీటిలో కార్బోహైడ్రేట్లు (పిండి పదార్థాలు) చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని తిన్నప్పుడు రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, వీటిని తినేటప్పుడు ప్రోటీన్ ఎక్కువగా ఉండే సాంబార్ లేదా ఇతర పదార్థాలతో కలిపి తీసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.

6. తృణధాన్యాలు& గ్రానోలా (Cereals/Granola) - 2/10
 ఇవి బాగా ప్రాసెస్ చేసినవి. వీటిలో దాగి ఉన్న చక్కెరలు, నూనెలు పేగు ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. మంచి అల్పాహారం మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. సరైన ఎంపిక లేకపోతే భోజనానికి ముందే మీకు మళ్ళీ ఆకలి వేస్తుంది లేదా నీరసం వస్తుంది.