హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో జరిగిన పోలింగ్ సరళిని పరిశీలిస్తే.. దాదాపు 90 శాతం స్థానాల్లో హస్తం పార్టీ జెండా ఎగరబోతోందని ఆయన స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా పాలనకు, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధికి పట్టణ ఓటర్లు పట్టం కట్టారని ఆయన పేర్కొన్నారు.
ప్రజల అవసరాలను గుర్తించి తీసుకుంటున్న వేగవంతమైన నిర్ణయాలు, పారదర్శక పరిపాలన, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండటంతో కాంగ్రెస్ పట్ల ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంచాయన్నారు. పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు, పారిశుధ్య వ్యవస్థ మెరుగుదలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఓటర్లలో సానుకూల భావనను కలిగించాయని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేసిన అసత్యాలు, అవాస్తవాలను ప్రజలు నమ్మలేదని తెలుస్తోందన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు.
