హైదరాబాద్ లోని కాలాపత్తర్ లో రౌడీ షీటర్లు రెచ్చిపోయారు. స్థానికులపై దాడి చేసి భయభ్రాంతులకు గురి చేశారు. ఇండ్లు, షాపుల్లో చొరబడి విధ్వంసం సృష్టించారు. అడ్డు వచ్చిన వారిని చితకబాది తీవ్రంగా గాయపర్చారు. వివరాల్లోకి వెళితే..
బుధవారం (ఫిబ్రవరి 11) రాత్రి కాలాపత్తర్ లోని ఫాతిమా ఆస్పత్రి సమీపంలో ఓ కిరాణ స్టోర్ పై స్థానిక రౌడీషీటర్ అసద్, అతని గ్యాంగ్ దాడికి పాల్పడ్డారు. దాడిలో షాపు నిర్వాహకుడుకి గాయాలయ్యాయి. అసద్,అ తని గ్యాంగ్ షాపులో చొరబడి విధ్వంసం సృష్టించారు. అడ్డువచ్చిన షాపు నిర్వాహకుడు ఖుర్రామ్ అనే యువకుడిని చితకబాదారు. తీవ్రంగా గాయపడిన ఖుర్రామ్ ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు స్థానికులు.
కాలాపత్తర్ నుంచి బహిష్కరణకు గురైన అసద్ తిరిగి ఆ ప్రాంతంలో దాడులకు పాల్పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అసద్ ముఠా దాడితో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఎప్పుడు ఏ దాడి జరుగుతుందోనని ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న కాలాపత్తర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
