- మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రకటన
- హైదరాబాద్‌లోని గోల్కొండ, రంగారెడ్డి జిల్లా గండిపేట మండలాల పరిధిలో సేకరణ
హైదరాబాద్, వెలుగు: మూసీ పునరుజ్జీవనంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఫేజ్ ఏ1లో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కిలోమీటర్లు, ఫేజ్ ఏ2లో ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్లు పరిధిలో భూసేకరణ చేపట్టనుంది. ఈ మేరకు మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్, గోల్కొండ మండలం, రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పరిధిలో భూ సేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. సుమారు 50 ఎకరాలకు పైగా భూమిని సేకరించే ప్రక్రియను స్టార్ట్ చేసింది. అయితే, భూ సేకరణ నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించింది.
కాగా, భూ యజమానులకు మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం అందించేందుకు నిర్ణయించింది. ఆయా యజమానులు తమ హక్కుల పత్రాలు (పట్టాలు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు) గుడువులోగా సమర్పించాలని చెప్పింది. సర్వే నంబర్లు, గ్రామాల వారీగా పూర్తి జాబితాను కూడా ప్రకటించింది. భూ సేకరణ చట్టం 2013 నిబంధనల ప్రకారం సేకరణ ప్రక్రియను అధికారులు చేపట్టనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో మూసీ అభివృద్ధి పనులు దశలవారీగా కొనసాగనున్నాయి. మొత్తం గండిపేట నుంచి గౌరెల్లి వరకు సుమారు 55 కిలోమీటర్ల పరిధిలో, 14 మండలాలు, 46 గ్రామాల్లో మూసీ అభివృద్ధి జరగనుంది.
