ఇండిగో సంక్షోభంపై కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు కమిటీ తన నివేదికను DGCA (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్)కి సమర్పించింది. అయితే కమిటీ నివేదికను గోప్యంగా ఉంచారు . అందులో కీలక అంశాలను ఇంకా బహిరంగపరచలేదు. దర్యాప్తు కమిటీ నివేదికను సమర్పించిందని, కాపీలను పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు, కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా కార్యాలయాలకు కూడా పంపామని DGCA సీనియర్ అధికారి తెలిపారు.
భవిష్యత్ లో ఇండిగో లాంటి సంక్షోభాలు తలెత్తుకుండా కమిటీ సూచనలు , సలహాలు చేసినట్లు తెలుస్తోంది. దర్యాప్తు కమిటీ సూచనతో పౌర విమానయాన శాఖ ఇండిగోకు భారీ జరిమానాతోపాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
డిసెంబర్ ప్రారంభంలో ఇండిగోలో సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. దాదాపు 5000 విమాన సర్వీసుల రద్దు కావడం లక్షలాదిమంది ప్రయాణికులపై తీవ్ర ప్రభావం చూపింది . ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోవడం వంటి పరిణామాలతో కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇండిగో సంక్షోభానికి కారణాలు, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలను నివారించడానికి DGCA జాయింట్ డైరెక్టర్ జనరల్ సంజయ్ కె బ్రహ్మణే నేతృత్వంలో కమిటీ ఏర్పడింది. ఇందులో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అమిత్ గుప్తా , సీనియర్ భద్రతా అధికారులు కెప్టెన్ కపిల్ మాంగ్లిక్, కెప్టెన్ లోకేష్ రాంపాల్ వంటి అధికారులు ఉన్నారు. ఈ క్రమంలో ఇండిగో సంక్షోభంపై విచారణ జరిపిన కమిటీ..డిసెంబర్ 26న సాయంత్రం DGCAకు నివేదికను అందించింది దర్యాప్తు కమిటీ.
ఇండిగో సంక్షోభానికి కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని భవిష్యత్తులో మరోసారి ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండేలా వ్యవహరిస్తామని పౌర విమానం శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దర్యాప్తు కమిటీ నివేదిక ఆధారంగా ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థపై చర్యలు తీసుకుంటామన్నారు.
