నల్గొండ, వెలుగు: భారత కమ్యూనిస్టు పార్టీ చేసిన పోరాటాలు చారిత్రాత్మకమైనవని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. శుక్రవారం సీపీఐ101వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జిల్లా కేంద్రంలోని మగ్దూమ్ భవన్లో ఎర్రజెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ..సీపీఐ రైతు, కార్మిక, విద్యార్థి, మహిళా హక్కుల కోసం రాజీలేని పోరాటాలు చేస్తూ అనేక నిర్బంధాలు, జైలు జీవితాలు లెక్కచేయకుండా అలుపెరుగని పోరాటాలు చేసిందని గుర్తు చేశారు.
సీపీఐ100 ఏండ్ల ముగింపు బహిరంగ సభ ఖమ్మం జిల్లాలో జనవరి 18న లక్షలాది మందితో జరుగుతుందని, సభకు అధిక సంఖ్యలో తరలివచ్చి సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎలాంటి పోరాట చరిత్ర లేని బీజేపీ నేడు కేంద్రంలో అధికారంలో ఉండి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ పౌర హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. మావోయిస్టులు చర్చలు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ అడవుల్లో మృగాల కంటే హీనంగా ఆపరేషన్ కగార్ పేరుతో చంపడం దారుణమన్నారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తుందని ఆశిస్తే నిరాశ మిగిలించిందని కాంగ్రెస్ పాలనపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. జిల్లా సహాయ కార్యదర్శి శ్రవణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు వీరాస్వామి, నర్సింహా, పట్టణ కార్యదర్శి సైదిరెడ్డి, శాంతి సంఘం జిల్లా కార్యదర్శి యాదయ్య, పట్టణ సహాయ కార్యదర్శి లెనిన్ తదితరులు పాల్గొన్నారు.
