పాడి పరిశ్రమపై సర్కారు ఫోకస్..లింగ నిర్ధారణ వీర్యంతో కృత్రిమ గర్భధారణ

పాడి పరిశ్రమపై సర్కారు ఫోకస్..లింగ నిర్ధారణ వీర్యంతో కృత్రిమ గర్భధారణ
  • 90 శాతం పెయ్య దూడలే పుడుతున్నట్లు ఆఫీసర్ల వెల్లడి

జయశంకర్​భూపాలపల్లి, వెలుగు: పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పెయ్య దూడలు పుట్టేలా లింగ నిర్ధారణ చేసిన వీర్యాన్ని సబ్సిడీపై రైతులకు సప్లై చేస్తోంది. గతంలో కృత్రిమ గర్భదారణ చేస్తే 50 శాతం మగ దూడలు, 50శాతం పెయ్య దూడలు పుట్టేవి. ఈక్రమంలో పాడి రైతులకు మేలుజాతి హెచ్ఎఫ్, గిర్, సాహివాల్​ బ్రీడ్​ వీర్యాన్ని సప్లై​చేస్తున్నారు. లింగ నిర్ధారణ చేసిన మేలు జాతి వీర్యం సబ్సిడీపై అందిస్తుండడంతో 90 శాతం పెయ్య దూడలు పుడుతున్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు.

పాల ఉత్పత్తి పెంచేందుకు..

రాష్ట్రీయ గోకుల్  మిషన్​ ద్వారా ప్రాథమిక పశు వైద్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, గోపాలమిత్రలకు లింగ నిర్ధారిత వీర్య నాళికలను ప్రభుత్వం సప్లై చేస్తోంది. జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో ఈ ఏడాది నెదర్లాండ్  దేశానికి చెందిన ఫారన్​ బ్రీడ్  హెచ్ఎఫ్(హలోస్టేన్​ ప్రీజియన్), నార్త్  ఇండియాకు చెందిన గిర్, సాహివాల్ బ్రీడ్  అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో 110 స్ట్రాలు(యూనిట్లు) అందుబాటులో ఉండగా, ఇప్పటి వరకు80 స్ట్రాలు పశువులకు అందించారు. వీటి ద్వారా 123 పెయ్య దూడలు పుట్టినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.

సబ్సిడీపై వీర్యం..

మేలు జాతి వీర్యం ఒక్కో యూనిట్ కు ప్రభుత్వం రూ.600 వరకు ఖర్చు చేస్తుండగా, రైతులకు సబ్సిడీపై రూ.150 అందిస్తోంది. రాయితీ స్కీమ్​పై క్షేత్రస్థాయిలో రైతులకు పశువైద్యాధికారులు, గోపాల మిత్రలు అవగాహన కల్పిస్తున్నారు. పశువైద్యాధికారులు టార్గెట్  పెట్టుకుని వీటిని అందజేస్తున్నారు. జిల్లాలోని భూపాలపల్లి, గణపురం, రేగొండ, కాటారం పరిధిలో పలువురు రైతులు పశువుల షెడ్లు ఏర్పాటు చేసి మేలుజాతి పశు సంతతిని వృద్ధి చేస్తున్నారు. 

దీంతో పాటు పాడి రైతులకు 75 శాతం సబ్సిడీపై గడ్డి గింజలు పంపిణీ చేస్తున్నారు. జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో 1.63 మెట్రిక్ టన్నుల గడ్డి గింజలను రైతులకు అందజేశారు. సబ్సిడీపై వీర్యం, గడ్డి గింజలు సప్లై చేయడం రైతులకు చేయూతనిస్తుండగా, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

పాలతో పాటు సేంద్రియ సేద్యం..

స్వచ్చమైన పాలతో పాటు సేంద్రియ వ్యవసాయం చేపడుతూ పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతున్నారు. రేగొండ మండల కేంద్రంలో రిటైర్డ్  టీచర్  ఎస్​ లక్ష్మీపతి దేశవాళి ఆవులతో పాటు రాజస్థాన్​ నుంచి 10 సాహివాల్‌ ఆవులను కొనుగోలు చేసి పాల ఉత్పత్తులతో పాటు గోమూత్రం, పేడతో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. ఒక్కో ఆవు రోజుకు 10 నుంచి 15 లీటర్ల వరకు పాలు ఇస్తుండగా, బహిరంగ మార్కెట్​లో లీటర్  పాలు రూ.50 విక్రయిస్తున్నారు. 

రోజుకు 70 లీటర్ల పాలు వస్తుండగా, రూ.3,500 వస్తున్నాయని చెప్పారు. ఆవు పేడ, మూత్రంతో తయారు చేస్తున్న జీవామృతాన్ని రైతులకు లీటర్ కు రూ.20 అందజేస్తున్నారు. ఓ వైపు ఆదాయం పొందుతూనే వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పిస్తున్నారు.