బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS) అగరబత్తి రంగానికి సంబంధించి తొలిసారిగా దేశంలో సరికొత్త IS 18574:2024 ప్రమాణాలను నోటిఫై చేసింది. దేశవ్యాప్తంగా ప్రతి ఇంట్లోనూ, పూజా కార్యక్రమాల్లోనూ విరివిగా వాడే అగరబత్తుల నాణ్యతను పెంచడం, వినియోగదారుల ఆరోగ్యాన్ని రక్షించడం ఈ కొత్త నిబంధనల ముఖ్య ఉద్దేశ్యంగా ఉంది. ఇప్పటివరకు అన్ ఆర్గనైజ్డ్ రంగంగా ఉన్న ఈ పరిశ్రమలో.. నాణ్యతా ప్రమాణాలు అమల్లోకి రావడం ఒక కీలక మలుపుగా చెప్పువచ్చు.
BIS కొత్త నిబంధనల ప్రకారం.. అగరబత్తుల తయారీలో వాడే ముడిపదార్థాలపై స్పష్టమైన ఆంక్షలు ఉంటాయి. ముఖ్యంగా అగరబత్తులు వెలిగించినప్పుడు వచ్చే పొగలో హానికరమైన రసాయనాలు, హెవీ మెటల్స్ ఉండకూడదని బీఐఎస్ స్పష్టం చేసింది. తక్కువ నాణ్యత గల బొగ్గు లేదా కెమికల్స్ వాడటం వల్ల వచ్చే పొగ శ్వాసకోస సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి ఇకపై తయారీదారులు పర్యావరణహితమైన, ఆరోగ్యానికి హాని చేయని పదార్థాలను మాత్రమే అగరబత్తీల తయారీలో వాడాల్సి ఉంటుంది.
అగరబత్తి ప్యాకెట్లపై కేవలం పేరు మాత్రమే కాకుండా.. అందులో వాడిన సుగంధ ద్రవ్యాలు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎప్పటి లోపు వాడుకోవాలి వంటి వివరాలను స్పష్టంగా ముద్రించాల్సి ఉంటుంది కంపెనీలు ఇకపై. ప్యాకేజింగ్ అనేది లోపల ఉన్న అగరబత్తుల సువాసన కాలక్రమేణా తగ్గిపోకుండా, తేమ తగలకుండా పటిష్టంగా ఉండాలి. నిబంధనలను పాటించే కంపెనీలు తమ ఉత్పత్తులపై 'ISI' మార్కును పొందే అవకాశం ఉంటుంది. ఇది వినియోగదారుల్లో నమ్మకాన్ని కూడా పెంచుతుంది.
ALSO READ : పతనం దిశగా 'కింగ్ డాలర్'..
ఈ ప్రమాణాల వల్ల నకిలీ ఉత్పత్తులకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. చిన్న తరహా తయారీదారులు కూడా ఈ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తే, భారతీయ అగరబత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి గిరాకీ ఏర్పడుతుంది. వినియోగదారులు కూడా ఇకపై తక్కువ ధరకు వస్తున్నాయని కాకుండా, ప్రమాణాలు కలిగిన నాణ్యమైన అగరబత్తులను ఎంచుకోవడం ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ప్రస్తుతం పొల్యూషన్ తో నిండిపోయిన ప్రపంచంలో ఇలాంటి మార్పు మంచిదేనని భారతీయ కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజా హితం ఇదొక మంచి ముందడుగుగా వారు చెబుతున్నారు.
