పండక్కి కారు, బైక్, వాషింగ్ మెషిన్ కొంటున్నారా..? CIBILతో సంబంధం లేకుండా లోన్స్..

పండక్కి కారు, బైక్, వాషింగ్ మెషిన్ కొంటున్నారా..? CIBILతో సంబంధం లేకుండా లోన్స్..

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణల పేరుతో పన్నులను తగ్గించింది. దీంతో -గృహోపకరణాల నుంచి కార్లు, బైక్స్ వరకు అన్నింటిపైనా రేట్లు తగ్గాయి. చాలా మంది తమ నచ్చిన ఫోన్లు, కార్లు లేదా ఇత వస్తువులను దసరా, దీపావళి సేల్ సమయంలో తగ్గిన రేట్లకు ఈఎంఐలపై కొనాలని ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో కన్జూమర్ లోన్స్ ఇచ్చే కంపెనీలు కూడా ఈ పండక్కి భారీ బిజినెస్ చేయాలని సిద్ధం అవుతున్నాయి. 

వాస్తవానికి ఆగస్టు 25, 2025న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్ సభ సమావేశాల్లో సిబిల్ స్కోర్ గురించి కీలక ప్రకటన చేసింది. లోన్స్ కోసం రిజర్వు బ్యాంక్ కనీస సిబిల్ స్కోర్ గురించి రూల్స్ ఇవ్వలేదని చెప్పింది. అంటే మెుదటి సారి అసలు ఎలాంటి సిబిల్ లేదా క్రెడిట్ హిస్టరీ లేని వ్యక్తులకు రుణాలు రిజెక్ట్ చేయకుండా రుణ సౌకర్యం పొందేందుకు వీలు కల్పించబడింది. రుణం అడుగుతున్న వ్యక్తికి ఉన్న ఆదాయం లోన్ ఈఎంఐ చెల్లింపులు చేయగలడా లేదా అనే విషయాన్ని మాత్రం బ్యాంకులు అంచనా వేసుకుంటే లోన్ ఇవ్వొచ్చని వెల్లడించింది ఆర్థిక శాఖ.  

ALSO READ : దసరాకి కొత్త ఐఫోన్ కొనాలనుకుంటున్నారా..?

కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటన లక్షల మంది మొదటిసారి లోన్ కోసం ఈ పండుగ సమయంలో వెళ్లే కస్టమర్లకు CIBIL స్కోర్ లేనప్పటికీ రుణాలు ఇవ్వటానికి బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ సంస్థలు సిద్ధం అవుతున్నాయి. ఈ కొత్త నిబంధన 2025 నుండి అమల్లోకి వచ్చింది. ఈ నిర్ణయం వల్ల, మొదటి సారి రుణం తీసుకునే వారు వారి క్రెడిట్ హిస్టరీ లేకపోయినా లేదా CIBIL స్కోర్ తనిఖీ చేయకుండా వాహనాలు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ షాపింగ్ చేయటానికి వీలు ఏర్పడుతోంది. 

ప్రధానంగా కొత్త రూల్స్ ప్రకారం టైర్ 2, టైర్ 3 నగరాల్లో ప్రజలకు రుణాలు సులభంగా లభిస్తాయని భావిస్తున్నారు. పండగలాంటి ఈ వార్తతో కొత్త రుణార్థుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. ఇప్పుడు మొదటిసారి లోన్ కోరేవారు CIBIL స్కోర్ లేకుండా కూడా లోన్ పొందవచ్చు. ఇది దేశంలో ఆర్థిక వృద్ధి, సామాన్య ప్రజల ఆర్థిక అవసరాల తీర్చటంలో తోడ్పడుతుందని నిపుణులు అంటున్నారు.