
వరంగల్: ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ పార్టీ వాళ్లను అసెంబ్లీ గేటు తాకనీయనని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాగ్ధానం చేశార.. చెప్పినట్లే ఒక్క గులాబీ పార్టీ ఎమ్మెల్యేను గేటు తాకనీయలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో లక్షల కోట్లు అవినీతి చేశారని బీఆర్ఎస్పై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ వాళ్లకు పదవి లేకపోయే సరికి పేద ప్రజలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు.
సోమవారం (జూన్ 30) పొంగులేటి వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రాయపర్తి మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత కష్టం వచ్చినా పేదవాడి కలలను సహకారం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్యంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. 8 లక్షల కోట్లు అప్పు ఉన్న.. వాటికి మిత్తి కడుతూ పేద ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేస్తున్నామన్నారు.
ALSO READ | ఏపీకి కేంద్రం బిగ్ షాక్.. బనకచర్ల ప్రాజెక్ట్‌కు అనుమతులు నిరాకరణ
గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యను నిర్వీర్యం చేసిందని ఫైర్ అయ్యారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి విద్యకు పెద్ద పీట వేస్తున్నారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా సన్న బియ్యం ఇవ్వడం లేదని.. దేశంలోనే ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సన్న బియ్యం ఇస్తున్నామన్నారు. ఎన్నికల ఉన్నప్పుడే గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చిందని.. ఇందిరమ్మ రాజ్యంలో మాత్రం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తున్నామని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకున్నా రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు వేశామని గుర్తు చేశారు. ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపి రైతుల కోసం భూభారతి చట్టం తీసుకువచ్చి రైతులకు మేలు చేస్తున్నామని చెప్పారు. మొదటి విడతగా రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని తెలిపారు. పార్టీ గెలుపు కోసం కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.