
- ఈ ఏడాది ఇంజినీరింగ్ ఫీజుల పెంపులేదు
- అన్ని ప్రొఫెషనల్ కోర్సులకూ పాత ఫీజులే
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- సర్కారు నిర్ణయంపై స్టూడెంట్లు, పేరెంట్ల హర్షం
హైదరాబాద్, వెలుగు:ప్రొఫెషనల్ కోర్సుల ఫీజుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2025-–26 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్ సహా అన్ని ప్రొఫెషనల్ కోర్సులకు గతంలో ఉన్న ఫీజులనే కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో ఇంజినీరింగ్‌తో సహా ఇతర వృత్తివిద్యా కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు భారీ ఊరట లభించినట్లయింది. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి యోగితారాణా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
2022– -25 విద్యా సంవత్సరం బ్లాక్ పీరియడ్‌కు ఖరారు చేసిన ఫీజులనే.. ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని బీటెక్/బీఈ, ఎంటెక్/ఎంఈ, బీఆర్క్, ఎంఆర్క్, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఫార్మ్ డీ, ఫార్మ్ డీ (పీబీ), ఎంబీఏ, ఎంసీఏ, ఎంబీఏ ఇంటిగ్రేటెడ్, బీ ఒకేషనల్ వంటి అన్ని ప్రొఫెషనల్ కోర్సులకూ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేశారు. మూడేండ్ల కింద వివిధ ప్రొఫెషనల్ కోర్సులకు 2022 – -25 బ్లాక్ పీరియడ్ ఫీజులను నిర్ణయించగా, 2024–25తో ఈ గడువు ముగిసింది.
దీంతో 2025–28 విద్యా సంవత్సరాల కోసం తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఫీజులను ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి పంపించింది. అయితే, ఫీజులను అసమగ్రంగా నిర్ణయించారని, సమగ్ర అధ్యయనం తర్వాతే ఫీజులను ప్రతిపాదించాలని టీఏఎఫ్ఆర్సీని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో ఏఐసీటీఈ నిబంధనల అమలు, కాలేజీల్లో వసతుల ఆధారంగానే ఫీజులను నిర్ణయించాలని సూచించారు. కాగా.. రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులు, పేరెంట్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.