కళ్యాణ్ జువెలర్స్ స్టాక్ రాకెట్ దూకుడు.. ఒక్కరోజే భారీ పెరుగుదలకు కారణాలివే..

కళ్యాణ్ జువెలర్స్ స్టాక్ రాకెట్ దూకుడు.. ఒక్కరోజే భారీ పెరుగుదలకు కారణాలివే..

కళ్యాణ్ జువెలర్స్ షేర్లు ఇంట్రాడే స్టాక్ మార్కెట్‌లో దుమ్మురేపుతున్నాయి. ఫిబ్రవరి 9న ట్రేడింగ్‌లో ఈ స్టాక్ ఏకంగా భారీగా పెరిగి ఇన్వెస్టర్ల సంపదను పెంచింది. అసలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణం ఏమిటి? కంపెనీ సెబీకి పెట్టుకున్న రిక్వెస్ట్ వెనుక ఉన్న కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.. 

కళ్యాణ్ జువెలర్స్ సంస్థ ఇటీవల సెబీకి ఒక కీలకమైన రిక్వెస్ట్ చేసుకుంది. కంపెనీ తన ఇన్వెస్ట్‌మెంట్ విభాగాన్ని లేదా కొన్ని అంతర్గత ఆర్థిక నిర్మాణాలను క్రమబద్ధీకరించడానికి అనుమతి కోరినట్లు మార్కెట్ వర్గాల సమాచారం. ముఖ్యంగా విదేశీ పెట్టుబడులు, ప్రమోటర్ల వాటాల మార్పులకు సంబంధించి నియంత్రణపరమైన వెసులుబాటు కోరుతూ కంపెనీ దరఖాస్తు చేసుకుంది. ఈ ప్రక్రియ పూర్తయితే.. కంపెనీలోకి మరింత విదేశీ నిధులు వచ్చే అవకాశం ఉందని, అలాగే సంస్థ కార్యకలాపాల్లో పారదర్శకత పెరుగుతుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. అలాగే తమ స్టాక్ మ్యానిపులేట్ చేసేలా ట్రేడ్స్ జరుగుతున్నాయనే అనుమానం వ్యక్తం చేస్తూ తాత్కాలికంగా ఫ్యూచర్స్ అండ్ ఆఫ్షన్స్ కేటగిరీలో తమను ట్రేడింగ్ నుంచి తొలగించాలని కూడా సెబీని కోరింది కళ్యాణ్. ఈ సానుకూల వార్త స్టాక్ ధరను రాకెట్‌లా పైకి తీసుకెళ్లింది. 

కేవలం సెబీ అభ్యర్థన మాత్రమే కాకుండా.. కంపెనీ ఇటీవల ప్రకటించిన 3వ త్రైమాసిక ఫలితాలు కూడా మార్కెట్‌లో ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నాయి. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కారణంగా కంపెనీ అమ్మకాలు భారీగానే పెరిగాయి. ముఖ్యంగా దక్షిణాదితో పాటు ఉత్తర భారతదేశంలో కూడా కళ్యాణ్ జువెలర్స్ తన మార్కెట్ వాటాను పెంచుకోవడంలో విజయం సాధించింది. అంతేకాకుండా.. బంగారం ధరల్లో స్థిరత్వం కూడా జువెలరీ రంగంలోని స్టాక్స్‌కు కలిసొచ్చిందని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రముఖ అంతర్జాతీయ, దేశీయ బ్రోకరేజ్ సంస్థలు కళ్యాణ్ జువెలర్స్ స్టాక్ పట్ల బుల్లిష్‌గా ఉన్నాయి. ప్రముఖ సంస్థలు ఈ స్టాక్‌కు 'బై'రేటింగ్‌ను ఇస్తూ స్టాక్ టార్గెట్లను పెంచాయి. కంపెనీ విస్తరణ ప్రణాళికలు, కొత్త స్టోర్ల ఏర్పాటు వేగంగా జరుగుతుండటంతో భవిష్యత్తులో ఈ సంస్థ మరింత ఆదాయాన్ని ఆర్జిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా "కాండెరే" వంటి ఆన్‌లైన్ బ్రాండ్‌ల పనితీరు కూడా కంపెనీకి అదనపు బలాన్ని ఇస్తోంది ఆర్థికంగా.

ఇదే క్రమంలో కంపెనీ ప్రమోటర్ల అరెస్ట్, ఫండ్ మేనేజర్లకు లంచాలు ఇచ్చినట్లు వస్తున్న తప్పుడు వార్తలను కూడా కంపెనీ ఖండించింది. ఇదే క్రమంలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మార్కెట్లో కొందరు షార్ట్ పొజిషన్లు తీసుకుని ఇలాంటి తప్పుడు ప్రచారంతో సోషల్ మాడియాను ప్రభావితం చేసి తమ స్టాక్స్ నష్టపోయేలా చేస్తున్నారనే అనుమానాన్ని కంపెనీ వ్యక్తం చేసింది. అయితే సోమవారం మధ్యాహ్నం 1.09 గంటల సమయంలో కంపెనీ షేర్లు 12 శాతం లాభంతో ఒక్కోటి రూ.425.90 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.