రెబల్ స్టార్ ప్రభాస్ , సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం స్పిరిట్. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే షూటింగ్ ప్రారంభం కాకముందే ఈ సినిమా చుట్టూ రకరకాల రూమర్లు షికారు చేస్తున్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న వెటరన్ యాక్టర్ ప్రకాష్ రాజ్ ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై సినీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది.
అసలేం జరిగింది?
సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఒక కీలక సన్నివేశానికి సంబంధించి ప్రకాష్ రాజ్ , దర్శకుడు సందీప్ వంగా మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.. ఇద్దరూ తమ పని విషయంలో చాలా పట్టుదలతో ఉంటారు. ఈ క్రమంలోనే ఒక సీన్ ఇంటర్‌ప్రిటేషన్ విషయంలో చర్చ కాస్తా వాగ్వాదానికి దారితీసిందని, అందుకే ప్రకాష్ రాజ్ ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు ఇండస్ట్రీ టాక్ నడుస్తోంది. గతంలో విడుదలైన గ్లింప్స్ కోసం ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారని, ఇప్పుడు ఆయన తప్పుకోవడం సినిమాకు కొంత లోటేనని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొదట దీపికా.. ఇప్పుడు ప్రకాష్ రాజ్?
అయితే 'స్పిరిట్' టీమ్‌కు ఇలాంటి మార్పులు కొత్తేమీ కాదు. తొలుగ ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా దీపికా పదుకొణెను అనుకున్నారు. కానీ రెమ్యునరేషన్,డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె తప్పుకుంది. ఆమె స్థానంలో 'యానిమల్' ఫేమ్ తృప్తి దిమ్రిని ఎంపిక చేశారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. దీంతో ఈ మూవీపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్, కాంచన వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. అయినప్పటికీ, ప్రకాష్ రాజ్ లాంటి నటుడు తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ప్రభాస్ కెరీర్‌లో అత్యంత కీలకం
ఒకవేళ 'స్పిరిట్' నుంచి తప్పుకున్నా, ప్రకాష్ రాజ్ చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిల్లో అడివి శేష్ 'డెకాయిట్', విజయ్ చివరి చిత్రం 'జననాయగన్'. రాజమౌళి - మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న 'వారణాసి' (SSMB29) చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే ఇటీవల సంక్రాంతి కానుకగా వచ్చిన 'రాజా సాబ్' ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయారు. దీంతో 'స్పిరిట్' ద్వారా ప్రభాస్ ఒక సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సందీప్ వంగా మార్కు వైలెన్స్, ఎమోషన్ ఈ సినిమాలో ఏ స్థాయిలో ఉంటాయోనని దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
టి-సిరీస్ , భద్రకాళి పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 5, 2027న విడుదల కానుంది. ప్రకాష్ రాజ్ నిష్క్రమణపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఆయన తప్పుకుంటే, ఆ స్థానంలో మరో దిగ్గజ నటుడిని సందీప్ వంగా రంగంలోకి దింపుతారేమో చూడాలి.
