పాశమైలారం ఫ్యాక్టరీలో పేలుడు ఘటన..26కు చేరిన మృతుల సంఖ్య

పాశమైలారం ఫ్యాక్టరీలో పేలుడు ఘటన..26కు చేరిన మృతుల సంఖ్య
  • సిగాచి కెమికల్ ​ఫ్యాక్టరీలో భారీ పేలుడు
  • 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డ కార్మికులు
  • కుప్పకూలిన మూడంతస్తుల అడ్మినిస్ట్రేషన్​ బిల్డింగ్​
  • ప్రమాద సమయంలో ఫ్యాక్టరీ లోపల 150 మంది
  • స్పాట్​లోనే ఆరుగురు.. చికిత్సపొందుతూ 13 మంది మృతి
  • మృతుల్లో ప్లాంట్ వైస్​ ప్రెసిడెంట్ గుహన్ 
  • 30 మందికి తీవ్ర గాయాలు.. దవాఖానలకు తరలింపు
  • సహాయక చర్యలు చేపట్టిన ఫైర్, రెవెన్యూ, పోలీస్​ సిబ్బంది 
  • ఘటనపై ప్రధాని మోదీ, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
  • మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి  రూ. 50 వేల చొప్పున కేంద్రం తక్షణ సాయం

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డిజిల్లా పాశ మైలారం సిగాచి ఫార్మాలో జరిగిన ఘోర ప్రమాదంతో మృతుల సంఖ్య 26కు చేరింది. జిల్లా యంత్రాంగం, వైద్య, రెస్క్యూ, పోలీసు బృందాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు  57 మంది సురక్షితంగా బయటపడ్డారు. గాయాలతో 35 మంది చికిత్స పొందుతున్నారు.ఈ ప్రమాఆదంలో మొత్తం 47 మంది గల్లంతు అయినట్లు తెలుస్తోంది. మృతిచెందిన 20 మృతదేహాలు గుర్తు పట్టలేని స్థితిలో లభ్యమయ్యాయి. 27 మంది ఇప్పటికీ శకలాల కింద ఉన్నట్లు తెలుస్తోంది. చనిపోయిన 26మంది  మృతదేహాలను పోస్టుమార్టమ్ కోసం పటాన్‌చెరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

మరోవైపు మృతదేహాలను గుర్తించేందుకు రక్తనమూనాలు సేకరించి DNA పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ సహకారంతో డీఎన్​ ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను గుర్తించారు. 

సిగాచి కెమికల్​ ఫ్యాక్టరీలో సోమవారం ఉదయం భారీ పేలుడు పేలుగు ఘటన జరిగింది. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంతో ఫ్యాక్టరీ పరిసరాల్లో ఘాటైన వాసనలు వ్యాపించగా చుట్టు పక్కల ప్రజలు భయంతో వణికిపోయారు. ఫ్యాక్టరీలో ఉదయం సుమారు 9 గంటలకు ఒక్కసారిగా భారీ పేలుడు​ సంభవించడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. 

 ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 150 మంది పనిచేస్తున్నారు. ఇందులో స్పాట్​లోనే ఆరుగురు సజీవ దహనం అయ్యారు. మరో 13 మంది దవాఖానలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ధాటికి కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు.  ఫ్యాక్టరీలోని మూడంతస్తుల అడ్మినిస్ట్రేషన్​ బిల్డింగ్​ కుప్ప కూలింది. దీని శిథిలాల కింద పెద్దసంఖ్యలో కార్మికులు చిక్కుకుపోయారు. పక్కనే ఉన్న మరో బిల్డింగ్ సైతం బీటలు వారింది. పేలుడు కారణంగా భారీ శబ్దం రావడంతో ఫ్యాక్టరీలోని మిగతా విభాగాల్లో పని చేస్తున్న కార్మికులు బయటకు పరుగులు తీశారు. ఫైర్, రెవెన్యూ, పోలీస్​ సిబ్బంది రంగంలోకి దిగి, సహాయక చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్​ పంకజ్ హుటా హుటిన సంఘటనా స్థలానికి  చేరుకొని, రెస్క్యూ ఆపరేషన్​ను పర్యవేక్షించారు. మృతులు, క్షతగాత్రులంతా ఒడిశా, బిహార్, ఏపీకి చెందినవారే. కార్మికుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో అక్కడి పరిస్థితి భీతావహంగా మారింది. 

భారీ క్రేన్ల సాయంతో..

పేలుడు ధాటికి కుప్ప కూలిన శిథిలాలను తొలగించేందుకు అధికారులు భారీ క్రేన్లను తెప్పించారు. శిథిలాల కింద 15 మంది కార్మికులు ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం కావడంతో రెస్క్యూ ఆపరేషన్​ప్రారంభించారు. బాధితులను తరలించేందుకు అంబులెన్స్​ను సిద్ధంచేశారు. 2వ బ్లాక్​లో మంటలు అదుపులోకి రాకపోవడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.  డ్రోన్లను వినియోగించి లోపలి పరిస్థితి తెలుకున్నారు. 11 ఫైర్​ ఇంజన్లు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. గాయపడిన వారిని అంబులెన్స్​లలో దవాఖానలకు తరలించారు. ఘటనా స్థలంలో వార్​ రూం ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. బాధితుల్లో కొందరి శరీరాలు 80 శాతం వరకు కాలిపోయాయి. 22 మందికి 25 శాతం కాలిన గాయాలైనట్టు డాక్టర్లు చెప్తున్నారు. 

మృతుల్లో ప్లాంట్​ వైస్​ ప్రెసిడెంట్ 

ఈ పేలుడు ఘటనలో ప్లాంట్‌‌ వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ ఎల్‌‌ఎన్‌‌ గోవన్‌‌ దుర్మరణం పాలైనట్టు అధికారులు చెప్తున్నారు. గోవన్‌‌ ప్లాంట్‌‌లోకి అడుగుపెట్టిన సమయంలోనే పేలుడు సంభవించింది. ప్రమాద ధాటికి ఆయన కారు నుజ్జునుజ్జయింది.  బిల్డింగ్​లోని రికార్డుల విభాగం పూర్తిగా కాలిపోయింది. గ్రూప్ యాజమాన్యం వస్తేనే పూర్తి వివరాలపై క్లారిటీ వస్తుంది.19 మంది కార్మికులు మృతి చెందినందున వారి వివరాల కోసం రాత్రి వరకు ఫోరెన్సిక్​ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాలిపోయిన డెడ్​ బాడీలు ఎవరివో గుర్తించేందుకు డీఎన్‌‌ఏ టెస్టులు చేస్తామని అధికారులు తెలిపారు.

స్పాట్​కు మంత్రులు గడ్డం వివేక్, దామోదర

కెమికల్​ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాద సమాచారం అందిన వెంటనే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్​ వెంకట స్వామి, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. కలెక్టర్లు, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. మాజీమంత్రి హరీశ్​రావు ఘటనాస్థలికి చేరుకొని బాధిత కుటుంబాలతో మాట్లాడారు. ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్​ ఆరాతీశారు. 

కంట్రోల్​ రూం ఏర్పాటు..

సిగాచి ఫ్యాక్టరీలో పేలుడు ఘటనపై సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్​లో కంట్రోల్​ రూం ఏర్పాటు చేశారు.  ప్రమాద బాధితుల వివరాల కోసం 08455276155ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. 


తీవ్రంగా గాయపడి  చికిత్స పొందుతున్న వారి వివరాలు..

క్ర.సంఖ్య    పేరు    రాష్ట్రం
1    నగ్నజిత్ బారి     ఒడిశా
2    రామ్ సింగ్    ఒడిశా
3    రాంరాజ్     బిహార్
4    రాజశేఖర్ రెడ్డి     ఏపీ
5    సంజయ్ ముఖయా     బిహార్
6    ధన్బీర్ కుమార్ దాస్     బిహార్
7    నీలాంబర్     ఒడిశా
8    సంజయ్ కుమార్ యాదవ్     ఒడిశా
9    గణేశ్ కుమార్     బిహార్
10    దేవ్​చంద్​     బిహార్
11    యశ్వంత్     ఏపీ
12    అభిషేక్ కుమార్     బిహార్
13    నాగరాజిత్ తివారీ    ఒడిశా