- లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఎంపీపై వేటు వేయాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలోని జేఎన్‌యూలో 11 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ అంగోమ్‌చా బిమోల్ అకోయిజామ్‌ను పార్టీ నుంచి వెంటనే బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మహిళా మోర్చా శనివారం గాంధీభవన్ ముట్టడికి యత్నించింది. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు, నేతలు నాంపల్లిలోని గాంధీభవన్ వైపు ర్యాలీగా వెళ్లారు.
దీంతో పోలీసులు బారికేడ్లతో అడ్డుకొని, వారిని అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా శిల్పారెడ్డి మాట్లాడుతూ నాలుగు నెలల కిందట బాధితులు ఫిర్యాదు చేయగా, ఇంటర్నల్ కమిటీ విచారణలో లైంగిక వేధింపులు రుజువు కావడంతో జేఎన్‌యూ ఈ నెల9న ఆయనను సర్వీస్ నుంచి తీసేసిందని గుర్తుచేశారు. వర్సిటీ కఠిన చర్యలు తీసుకున్నా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటివరకు ఆ ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎందుకు రక్షిస్తోందని నిలదీశారు.
