V6 News

వివేక్ వెంకటస్వామి అధ్యక్షతన సమావేశమైన బీజేపీ మేనిఫెస్టో కమిటీ

వివేక్ వెంకటస్వామి అధ్యక్షతన సమావేశమైన బీజేపీ మేనిఫెస్టో కమిటీ

హైదరాబాద్, వెలుగు: బీజేపీ తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు కొనసాగుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మేనిఫెస్టోల కన్నా జనాదరణ, వారి విశ్వాసం ఉండేలా తయారు చేయడంపై బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఫోకస్ పెట్టింది. ప్రధానంగా నిరుద్యోగులు, యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలను దృష్టిలో ఉంచుకొని ఈ మేనిఫెస్టో తయారు చేయాలని బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో జరిగిన మీటింగ్​లో మేనిఫెస్టో కమిటీ నిర్ణయించింది. 

కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ  సమావేశంలో కమిటీ సభ్యులు బూరనర్సయ్య, ఐవీ కృష్ణారావు, కామర్సు బాలసుబ్రమణ్యం, కరుణ గోపాల్, కృష్ణ ప్రసాద్, విఠల్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈ మేనిఫెస్టోకు పంచరత్నాలు లేదా నవరత్నాలు, ఇంద్ర ధనస్సు వంటి పేర్లు పెట్టి అందులో ఉన్న అంకెల ఆధారంగా అంశాలను చేర్చాలని కమిటీ నిర్ణయించింది. 

బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను పరిగణనలోకి తీసుకొని మేనిఫెస్టోను రూపొందిస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కర్నాటకలో అమలవడం లేదని, పైగా కేంద్రంలో అధికారంలో లేనిది ఈ గ్యారంటీలు అమలు కావనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలని కమిటీ నిర్ణయించింది. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఎలాంటి మేలు జరుగుతుందనేది ఈ మేనిఫెస్టోలో పొందుపర్చడంపై చర్చ జరిగింది. సమాజంలో అణగారిన వర్గాలను అక్కున చేర్చుకునేలా ఎన్నికల ప్రణాళికను రూపొందించడంపై కమిటీ దృష్టి పెట్టింది.