బీజేపీ మేనిఫెస్టో జ్ఞాన్ .. పేదలు, యువత, వ్యవసాయం,

బీజేపీ మేనిఫెస్టో జ్ఞాన్ ..  పేదలు, యువత, వ్యవసాయం,
  • నారీ శక్తి థీమ్​తో రూపకల్పన: కిషన్ రెడ్డి 
  • రెండు వేర్వేరు మేనిఫెస్టోలు విడుదల చేస్తం 
  • ఐదేండ్ల పాలనకు ఒకటి, ‘2047 ప్లాన్’కు మరొకటి 
  • వీటికోసం అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకుంటం
  • ప్రధానికి ఆహ్వానం పలికేందుకు సీఎం రేవంత్ 
  • వస్తరనే అనుకుంటున్నానని కామెంట్

హైదరాబాద్, వెలుగు: 2047 నాటికి ఇండియాను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే బీజేపీ లక్ష్యమని కేంద్రమంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి తెలిపారు. ‘వికసిత్​ భారత్’​ కోసం ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పారు. ఇండియాను అభివృద్ధి చెందిన దేశంగా నిలిపేందుకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. 2047 నాటికి అన్ని రంగాల్లో మన దేశం ఒక బ్రాండ్​గా నిలవాలని ఆకాంక్షించారు. అందులో భాగంగానే ‘GYAN (జ్ఞాన్)’ ఎజెండాతో ముందుకెళ్తున్నామని..  గరీబ్​కల్యాణ్, యూత్, అగ్రికల్చర్, నారీ శక్తి థీమ్​తో మేనిఫెస్టోను రూపొందిస్తామని వెల్లడించారు. వాళ్లను దేశాభివృద్ధిలో భాగం చేస్తామని పేర్కొన్నారు. శనివారం బీజేపీ స్టేట్​ఆఫీసులో ‘వికసిత్​భారత్ ​సంకల్ప పత్రం’ కార్యక్రమాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించారు. దానికి సంబంధించిన పోస్టర్​ను విడుదల చేశారు. ఇందులో భాగంగా మేనిఫెస్టోలో పెట్టాల్సిన అంశాలపై రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పారు. ‘‘రెండు రకాల మేనిఫెస్టోలు తయారు చేస్తాం. ఒకటి ఐదేండ్ల పాలనకు అవసరమయ్యేది అయితే.. రెండోది 2047 కల్లా భారత్​ను అభివృద్ధి చెందిన దేశంగా నిలిపే మేనిఫెస్టో. మేం పెడుతున్నది కేవలం మేనిఫెస్టో కాదు.. అది మా సంకల్పం” అని అన్నారు.  

నియోజకవర్గాల్లో బాక్సులు.. 

మేనిఫెస్టో కోసం అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకుంటామని కిషన్ రెడ్డి తెలిపారు. ‘వికసిత్ భారత్.. మోదీ కీ గ్యారంటీ’ అన్న నినాదంతో ముందుకె ళ్తున్నామని చెప్పారు. ‘‘ప్రజల అభిప్రాయాలు సేకరించి, ప్రధాని మోదీకి అందజేస్తం. ప్రజలతో నేరుగా సమావేశాలు నిర్వహించడం, ఇంటింటికీ వెళ్లి అభిప్రాయాలు సేకరించడం, డిజిటల్​మీడియా, నమో యాప్ ద్వారా సలహాలు, సూచనలు తీసుకుంటం. 90909 02024 నంబర్​కు మిస్డ్​కాల్​ఇచ్చి కూడా ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పొచ్చు. అంతేకాకుండా వాట్సాప్​ ద్వారా కూడా తెలియజేయవచ్చు. సలహాలు, సూచనల కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బాక్సులు కూడా ఏర్పాటు చేస్తాం. అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకుంటం. మార్చి 15 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. ప్రజల అభిప్రాయాలను పార్టీ సెంట్రల్​ఆఫీసుకు పంపిస్తాం’’ అని వివరించారు.   

పార్టీ కోసం విరాళాలు.. 

పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు, ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తున్నట్టు కిషన్​రెడ్డి తెలిపారు. నమో యాప్​ ద్వారా ప్రజలు తమకు నచ్చినంత విరాళం ఇవ్వొచ్చని చెప్పారు. ‘‘బీజేపీ ప్రజలు స్థాపించిన పార్టీ. ప్రజలతోనే పార్టీ నడుస్తున్నది. సాయం చేయాలనుకునే వాళ్లు డిజిటల్ రూపంలో చెల్లింపులు చేయొచ్చు. పార్టీలో ఎవరికీ టికెట్​హామీ ఇవ్వలేదు. అభ్యర్థులను హైకమాండ్ నే డిసైడ్​ చేస్తుంది. పార్టీలో చేరుతున్నోళ్లకు టికెట్​హామీ ఇవ్వట్లేదు. వాళ్లు స్వచ్ఛందంగానే చేరుతున్నారు” అని పేర్కొన్నారు. సికింద్రాబాద్​ కంటోన్మెంట్​పరిధిలో చాలా కాలంగా రక్షణ శాఖ భూముల బదిలీ విషయంలో నెలకొన్న సమస్యను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించిందని తెలిపారు. ‘‘175 ఎకరాల రక్షణ శాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయడం సంతోషకరమైన విషయం. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో కామారెడ్డి 44 హైవే, సిద్దిపేట ఒకటో నెంబర్​స్టేట్​హైవేల్లో ఎలివేటెడ్​ కారిడార్ల నిర్మాణం జరిగి ప్రజలకు ఉపయోగపడుతుంది. ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​సింగ్​కు కృతజ్ఞతలు” అని కిషన్​ రెడ్డి పేర్కొన్నారు.

రేవంత్ ​వస్తరనే అనుకుంటున్న.. 

ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. ‘‘ ప్రధాని ఆదివారం, సోమవారం రాష్ట్రంలో పర్యటిస్తారు. రూ.15,718 కోట్లతో ఆదిలాబాద్, సంగారెడ్డిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. సోమవారం వరకు పీపుల్స్​ప్లాజాలో జాతీయ సాంస్కృతిక మహోత్సవాలు జరుగుతాయి. చివరి రోజు దేశ సాంస్కృతిక వైవిధ్యం, నేత కార్మికుల నైపుణ్యాన్ని తెలియజేసేలా ‘శారీ వాకథాన్​’ నిర్వహిస్తాం. ఇందులో మహిళలు పాల్గొనాలి” అని కోరారు. ‘‘ప్రధాని పర్యటన ఉంటే ప్రొటోకాల్ ​ప్రకారం రాష్ట్ర సీఎం, అధికారులు వచ్చి ఆహ్వానం పలకాల్సి ఉంటుంది. మాజీ సీఎం కేసీఆర్​ వాటన్నింటినీ తుంగలో తొక్కారు. ఇప్పుడు ప్రధాని పర్యటన సంద ర్భంగా సీఎం రేవంత్​రెడ్డి ప్రొటోకాల్​ ప్రకారం వస్తారనే నేను అనుకుంటున్నాను” అని కిషన్​ రెడ్డి పేర్కొన్నారు.

బీఆర్ఎస్​ ఫాంహౌస్​కు వెళ్లిపోయింది

బీఆర్ఎస్​ పార్టీ ఫాంహౌస్​కు వెళ్లిపోయిందని, కేసీఆర్​ పని అయిపోయిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్​ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, పార్టీ నేతలు ప్రజాధనాన్ని, భూములను దోచుకున్నారన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్​కు భవిష్యత్తు లేదని, ఆ పార్టీకి ఓటేస్తే మూసీలో వేసినట్టేనని పేర్కొన్నారు. శనివారంతో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు ముగిశాయి. ఈ సందర్భంగా అంబర్​పేటలో నిర్వహించిన బహిరంగ సభలో కిషన్​రెడ్డి పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్​ పార్టీ దేశంలో మూడు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉందని, అందులో హిమాచల్​ ప్రదేశ్​లో అటూ ఇటుగానే ఉందన్నారు. కర్నాటకలో కాంగ్రెస్​కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని అన్నారు. అక్కడి ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని, గంపగుత్తగా బీజేపీ గెలుస్తుందని చెప్పారు. తెలంగాణలోనూ కాంగ్రెస్​ పరిస్థితి అలాగే ఉందని వ్యాఖ్యానించారు. రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేతలు అబద్ధాలాడి అధికారంలోకి వచ్చారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్​ పాలనకు తేడా లేదని, నాడు కేసీఆర్​ కుటుంబం పరిపాలిస్తే.. ఇప్పుడు రాహుల్​ కుటుంబం తెలంగాణను పాలిస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని పథకాలూ కేంద్రం నిధులతోనే నడుస్తున్నాయని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని, మోదీని ఆశీర్వదించి గెలిపించాలని కిషన్​రెడ్డి కోరారు.