- ఇయ్యాల్టి నుంచే అమల్లోకి...
మెదక్, వెలుగు : కూలీలకు గ్రామంలోనే పని కల్పించే ఉద్దేశంతో కేంద్రం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంలో ఇయ్యాల్టి నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. డూప్లికేట్స్‌కు అడ్డుకట్ట వేయడం, అవకతవకలను అడ్డుకునేందుకుగానూ కూలీల ఫొటోను కాప్చర్ చేసి అప్‌లోడ్ చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల పరిధిలో మొత్తం 53,98,235 మంది కూలీలు ఉన్నారు. కూలీల జాబ్‌కార్డును గతంలోనే ఆధార్‌తో లింక్ చేయడంతో పాటు ఈ కేవైసీ విధానాన్ని అమలు చేశారు.
ఒకరి స్థానంలో మరొకరు పని చేయడం, సగం పూట మాత్రమే పనికి రావడం వంటి వాటికి చెక్ పెట్టేందుకు ఉపాధి హామీ అసిస్టెంట్లు మస్టర్‌లో నమోదైన 10 మంది కూలీలను ఒకే చోట నిలబెట్టి వారి ఫోటో తీసి సంబంధిత యాప్‌లో అప్‌లోడ్ చేసేవారు. ఈ పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేయడంతో పాటు నిజంగా వర్క్ సైట్‌కు వచ్చి నిర్దేశిత సమయం మేరకు పనిచేసిన కూలీలకే లబ్ధి చేకూరేలో కొత్తగా వ్యక్తిగత ఫొటో కాప్చర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానాన్ని సోమవారం నుంచి అమల్లోకి తీసుకొస్తున్నారు.
ఇందులోభాగంగా వర్క్‌సైట్‌కు వచ్చిన ఒక్కో కూలీని వ్యక్తిగతంగా ఫొటో తీసి నేషనల్ మస్టర్ మెనేజ్‌మెంట్ సిస్టంలో అప్‌లోడ్ చేయనున్నారు. ప్రతి కూలీ ఫొటోను రెండు సార్లు తీయనున్నారు. ఉదయం 8 గంటలకు పని మొదలైన వెంటనే ఒకసారి, మధ్యాహ్నం 12 గంటల తర్వాత మరోసారి ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. రెండు ఫొటోలు యాప్‌లో అప్‌లోడ్ అయితేనే కూలీలకు వేతనం అందనుంది. జియో కోఆర్డినేషన్ సిస్టం ఆధారంగా యాప్ పనిచేస్తుండడంతో.. ఉదయం పని ప్రారంభించిన ప్లేస్‌లోనే మధ్యాహ్నం ఫొటో తీయాల్సి ఉంటుంది. ఈ కొత్త విధానం వల్ల ఈ – కేవైసీ పూర్తి చేసుకున్న కూలీలకు మాత్రమే పని దొరకనుంది.
