తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా మేడారంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. సెలవు రోజు కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో మేడారం పరిసరాలు కిటకిటలాడాయి. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసిన అనంతరం సమ్మక్క, సారలమ్మను దర్శించుకొని పసుపు, కుంకుమ, బంగారం, చీరసారె, పూలు, పండ్లు, సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జంపన్న వాగు నుచి గద్దెల ప్రాంగణం వరకు రోడ్డు వాహనాలతో నిండిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
కాగా, ఎండ తీవ్రత పెరుగుతుండడంతో చలువ పందిళ్లు వేయడంతో పాటు తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని భక్తులు కోరుతున్నారు. ఆదివారం ఉదయం అమ్మవార్లను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, ఎంపీ బలరాంనాయక్, బీజేపీ ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జు వెంకటేశ్వర్, తొర్రూర్ మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్ రజిని శేఖర్ తదితరులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
కొమురవెల్లిలో...
కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జున స్వామి జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో ఆదివారంకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు రద్దీగా మారాయి. శనివారం సాయంత్రమే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం ఉదయమే స్వామివారిని దర్శించుకొని పట్నాలు వేసి, ఒడిబియ్యం పోసి, ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి దర్శనానికి ఆదివారం ఒక్కరోజే సుమారు 40 వేల మంది భక్తులు వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు. రద్దీ కారణంగా స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పట్టింది.
