- మళ్లీ మళ్లీ మరిగించిన నూనెలో పాలిసైక్లిక్ కెమికల్స్
- పెద్ద పేగు క్యాన్సర్, గుండె జబ్బులు, బీపీలకు కారణం ఇదే
- హైదరాబాద్ సీఎస్ఐఆర్ ఐఐసీటీ, విజయవాడ మారిస్ స్టెల్లా కాలేజీ రీసెర్చ్ రిపోర్టులో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: మనం ఇష్టంగా తినే వేపుళ్లు, బజ్జీలలాంటి డీప్ ఫ్రైడ్ ఆహారం వెనుక ప్రాణాంతకమైన ‘స్లో పాయిజన్’ దాగి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పదే పదే మరిగించిన నూనెతో చేసిన వంటకాలతో ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నదని చెబుతున్నారు. ఒక్కసారి మరిగించిన నూనెను పదే పదే వేడి చేయడం వల్ల అది 180 డిగ్రీల సెల్సియస్ దాటాక విషతుల్యంగా మారుతున్నదని, దీనివల్ల పెద్దపేగు క్యాన్సర్, గుండె జబ్బులు, బీపీలాంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తేల్చారు.
హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్ ఐఐసీటీ, విజయవాడ మారిస్ స్టెల్లా కాలేజీ పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నూనెను 180 డిగ్రీల కంటే ఎక్కువ వేడి చేసినప్పుడు అందులో జరిగే రసాయన మార్పులు నేరుగా మన డీఎన్‌ఏ మీద దాడి చేస్తాయని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఇప్పటికే మళ్లీ మళ్లీ వేడి చేసిన నూనె వాడటం ద్వారా వచ్చే సమస్యలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న రీసెర్చ్ లను సైటింస్ట్‌లు రివ్యూ చేసి, వాటిని మన దేశ పరిస్థితులకు అన్వయించి.. ఒకరిపోర్టును తయారు చేశారు. ఈ రిపోర్టు ఇటీవలే ఇంటర్నేషనల్ క్లినికల్ అండ్ మెడికల్ కేస్ రిపోర్ట్స్ జర్నల్‌లో పబ్లిష్ అయింది.
నూనెను 180 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో మళ్లీ మళ్లీ మరిగించినప్పుడు అందులో భయంకరమైన రసాయన మార్పులు జరుగుతాయని సైంటిస్టులు తేల్చారు. వేడికి నూనె ఆక్సీకరణం చెందుతుంది. హైడ్రోలసిస్, పాలిమరైజేషన్ చర్యల వల్ల నూనెలోని మంచి కొవ్వు ఆమ్లాలు స్వరూపాన్ని పూర్తిగా మార్చుకుంటాయి. ఆరోగ్యకరమైన సిస్ రూపంలో ఉండాల్సిన కొవ్వులు, ప్రమాదకరమైన ట్రాన్స్ ఐసోమర్లుగా మారిపోతాయి. దీనివల్ల పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (పీఏహెచ్) అనే విషతుల్య పోలార్ కాంపౌండ్స్ పుట్టుకొస్తాయి.
లిపిడ్ పెరాక్సిడేషన్ వల్ల జన్యువులను దెబ్బతీసే, క్యాన్సర్ కలిగించే కారకాలు ఆ నూనెలో తయారవుతాయని పరిశోధకులు స్పష్టం చేశారు. పదే పదే వేడిచేసే నూనెతో కలిగే అనర్థాలపై విజయవాడలోని మారిస్ స్టెల్లా కాలేజీకి చెందిన సైంటిస్టులు రేఖాదేవి పెరుమాళ్ల వెంకట, హేమశ్రీ సోపేటి.. హైదరాబాద్ సీఎస్ఐఆర్- ఐఐసీటీ సహకారంతో అధ్యయనం చేశారు.
నూనెలపై నియంత్రణ కరువు
మన దేశంలో పేదరికం, సామాజిక, ఆర్థిక పరిస్థితుల వల్ల కాగిన నూనె వాడకం సర్వసాధారణమైపోయింది. కొన్ని సర్వేల ప్రకారం ఇండియాలో 48 శాతం మంది ప్రజలు వారానికి ఒకటి నుంచి 6 సార్లు బయట దొరికే ఫ్రైడ్ ఫుడ్ తింటున్నారు. మనం తినే స్నాక్స్‌లో 21 శాతం డీప్ ఫ్రై చేసినవే ఉంటున్నాయి. స్ట్రీట్ వెండర్లు, రెస్టారెంట్లు ఖర్చు తగ్గించుకుని, లాభాలు పెంచుకునేందుకు వాడిన నూనెనే రోజంతా మళ్లీ మళ్లీ వాడుతున్నారు. ఇంత జరుగుతున్నా మన దేశంలో కాగిన నూనె వాడకంపై సరైన నియంత్రణలు లేవు. ప్రజల్లో అవగాహన అస్సలు లేకపోవడం విచారకరమని రిపోర్ట్ పేర్కొన్నది.
పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో హాస్పిటల్స్ నిండిపోవడం ఖాయమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలని, అధికారులు తనిఖీలు చేపట్టాలని సూచిస్తున్నారు. సైంటిస్టులు కూడా కేవలం ల్యాబ్‌లకే పరిమితం కాకుండా, హోటల్స్‌లో ఏ రకమైన ఆయిల్ వాడుతున్నారో క్షేత్ర స్థాయి సర్వేలు చేయాలని తెలిపారు. సోషల్ మీడియా, వివిధ క్యాంపెయిన్ల ద్వారా ప్రజలకు ఈ నూనె వల్ల వచ్చే అనర్థాలను వివరించాలని, ఇండియాలో
మనుషులపై ఈ నూనె ప్రభావం ఎలా ఉందనే దానిపై దీర్ఘకాలిక పరిశోధనలు జరగాలని పిలుపునిచ్చారు.
రీహీటెడ్ ఆయిల్ వాడకంతో కొలోన్ క్యాన్సర్..
రీ-హీటెడ్ ఆయిల్ వాడకం వల్ల ప్రధానంగా కొలోన్ క్యాన్సర్ (పెద్ద పేగు క్యాన్సర్) వచ్చే ప్రమాదం పొంచి ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా అకాల మరణాలకు కారణమవుతున్న క్యాన్సర్లలో ఇది రెండో స్థానంలో ఉంది. మనం తీసుకునే ఆహారంలో ఉండే విషతుల్య పదార్థాలే 80 శాతం పేగు క్యాన్సర్లకు కారణమవుతున్నాయని రిపోర్టు స్పష్టం చేసింది. ఇది మాత్రమే కాదు.. మాడిపోయిన నూనె వాడకం వల్ల రక్తనాళాలు కుచించుకుపోయి, రక్త ప్రసరణ దెబ్బతింటుంది.
ఫలితంగా బీపీ విపరీతంగా పెరగడం, గుండె జబ్బులు, డయాబెటిస్‌లాంటి దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముడుతాయి. జంతువులపై చేసిన ప్రయోగాల్లో.. ఇలాంటి నూనెతో చేసిన ఆహారం తిన్నప్పుడు రక్త నాళాలు దెబ్బతినడం, శరీరంలో వాపు రావడం, రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్లు రావడం, డీఎన్ఏ దెబ్బతినడంలాంటివి గమనించినట్లు రిపోర్ట్ వెల్లడించింది.
