టీఆర్ఎస్ కార్యకలాపాలకు అసెంబ్లీని కేసీఆర్ అడ్డాగా మార్చుకున్నడు

టీఆర్ఎస్ కార్యకలాపాలకు అసెంబ్లీని కేసీఆర్ అడ్డాగా మార్చుకున్నడు

హైదరాబాద్‌‌, వెలుగు: అసెంబ్లీని సీఎం కేసీఆర్‌‌ తన పార్టీ కార్యకకాలాపాలకు, రాజకీయాలకు అడ్డాగా మార్చారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌‌ రావు మండిపడ్డారు. శాసన సభ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని విమర్శించారు. సోమవారం అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత మీడియా పాయింట్‌‌లో ఆయన మాట్లాడారు. ‘‘కేంద్ర ప్రభుత్వం టార్గెట్‌‌గానే అసెంబ్లీ ఎజెండా ఖరారు చేశారు. కేంద్రం ఎదుటి వారి మాట వినడం లేదని కేసీఆర్‌‌ అంటున్నారు. మరి అసెంబ్లీలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చారా? తెలుగు, ఇంగ్లిష్‌‌, హిందీ భాషల్లో కేసీఆర్‌‌ గంటన్నర మాట్లాడారు. నేను మూడు నిమిషాలు మాట్లాడితే బల్లలు కొట్టి మాట్లాడనివ్వలేదు” అని దుయ్యబట్టారు. సీఎం తానా అంటే వాళ్ల పరోక్ష, ప్రత్యక్ష మిత్రులు కాంగ్రెస్‌‌, ఎంఐఎం తందానా అంటున్నారని ఎద్దేవా చేశారు. కరెంట్‌‌ విషయంలో కేంద్రంపై విమర్శలు చేసిన భట్టి విక్రమార్క.. రాష్ట్ర ప్రభుత్వం గురించి ఒక్క మాట ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. 2020లో విద్యుత్‌‌ సంస్కరణల బిల్లు తెచ్చి 2022లో సెలక్ట్‌‌ కమిటీకి పంపారని, పార్లమెంట్‌‌లో పాస్‌‌ కాని బిల్లుపై అసెంబ్లీలో చర్చించారని విమర్శించారు. ఇదే చట్టంపై రెండు సార్లు తీర్మానాలు చేసి మన గౌరవం మనమే తగ్గించుకున్నామన్నారు.

బీఆర్ఎస్ పెట్టుకోండి.. వీఆర్‌‌‌‌ఎస్ కూడా తీసుకోండి..
‘‘కేసీఆర్‌‌ జాతీయ పార్టీ పెడుతామంటే ఎవరు వద్దన్నారు. దేశంలో 6,500 పార్టీలు ఉన్నాయి. బీఆర్‌‌ఎస్‌‌ పెట్టుకొని ప్రజలు ఆమోదించకుంటే వీఆర్‌‌ఎస్‌‌ తీసుకొని ఫాం హౌస్‌‌కు పరిమితవ్వమండి. మాకేం అభ్యంతరం లేదు” అని రఘునందన్‌‌ ఎద్దేవా చేశారు. కర్నాటక, మహారాష్ట్రలోని ప్రజలు తమను తెలంగాణలో కలపాలని అడుగుతున్నారని సీఎం చెప్తున్నారని, హైదరాబాద్‌‌ పాత సంస్థానంలోని ప్రాంతాలను తెలంగాణలో కలపాలని కోరుతూ తీర్మానం చేయాలని, ఎవరు వద్దన్నారని ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలను గౌరవించడం సీఎం దగ్గరి నుంచే మొదలు కావాలని, ప్రతిపక్షాలు అంటే కాంగ్రెస్‌‌, ఎంఐఎం మాత్రమే కాదన్నారు. మంగళవారం నాటి సభలో తమకు మాట్లాడే అవకాశం ఇస్తే కేసీఆర్‌‌ ప్రశ్నలకు సమాధానాలు చెప్తామన్నారు. విద్యుత్‌‌ చట్టంలో మోటార్లకు మీటర్లు పెట్టాలని ఎక్కడా లేదన్నారు. బిల్లు కాపీలను మీడియాకు ఇస్తానని, ఇందులో సబ్సిడీలు వద్దని కేంద్రం ఎక్కడ చెప్పిందో పరిశీలించాలని కోరారు.

కేంద్రం ప్రకటించేదాకా సెప్టెంబర్‌‌ 17 గుర్తురాలేదా?
తెలంగాణ తమకు కరెంట్‌‌ బకాయిలు ఇవ్వాలని ఏపీ లేఖ రాస్తే..తెలంగాణనేమో ఏపీ నుంచి రూ.17 వేల కోట్లు రావాలని అంటోందని, విద్యుత్‌‌ బకాయిలపై ఇద్దరు సీఎస్‌‌లతో మీటింగ్‌‌ పెట్టాలని రఘునందన్‌‌రావు అన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు డిస్కమ్‌‌లు, ట్రాన్స్‌‌కో, జెన్‌‌కో, సింగరేణికి సంబంధించిన పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌‌ చేశారు. కేసీఆర్‌‌ ప్రభుత్వం జిల్లాల్లో ఇతర పార్టీల ఆఫీసుల నిర్మాణానికి జాగా ఇవ్వలేదని, ఢిల్లీలో టీఆర్‌‌ఎస్‌‌ ఆఫీస్‌‌కు కేంద్రం ల్యాండ్‌‌ ఇచ్చిందని తెలిపారు. కేంద్రం ప్రకటించేదాకా సెప్టెంబర్‌‌ 17 వేడుకలు ఎందుకు అధికారంగా నిర్వహించడానికి ముందుకు రాలేదని నిలదీశారు. దేశాన్ని తెలంగాణ సాకుతున్నదని మాటిమాటికీ చెప్తున్నారని, అలాంటప్పుడు 0.5 శాతం ఎఫ్‌‌ఆర్‌‌బీఎం పెంచితే రూ.5 వేల కోట్ల అప్పు వస్తుందని ఎందుకు అంటున్నారని ప్రశ్నించారు.