
ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావు. కరోనా కట్టడిలో వైఫల్యం, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో జాప్యం, ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ, ఐఆర్, ప్రైవేట్ టీచర్ల సమస్యలను ఉభయ సభల్లో ప్రస్తావిస్తామన్నారు. ప్రభుత్వం ఏకపక్ష ధోరణి వీడి తమకు కూడా సమయం ఇవ్వాలన్నారు. ఎంఐఎంకి ఎంత సమయం ఇస్తున్నారో తమకు కూడా అంతే సమయం ఇవ్వాలన్నారు.
ఎల్ఆర్ఎస్ పై వాయిదా తీర్మానం పెట్టాం దానిపైన చర్చ జరగాలన్నారు ఎమ్మెల్సీ రాంచందర్ రావు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారన్నారు. పీఆర్సీ, ఐఆర్ సమస్యలపై ఉభయ సభల్లో గళం విప్పుతామన్నారు. నిరుద్యోగ సమస్యపై మాట్లాడతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కేంద్రంపై నెట్టాలని చూస్తున్నారన్నారు. అసెంబ్లీకి వెళ్లే ముందు గన్ పార్క్ లో అమరవీరులకు నివాళి అర్పించారు. ప్లకార్డులతో అసెంబ్లీ గేట్ దగ్గరికి చేరుకొని అక్కడ కాసేపు నిరసన తెలిపారు. ఆ తర్వాత సభల్లోకి వెళ్లారు.