- ఐదారుగురు జిల్లా అధ్యక్షులను మార్చే యోచనలో అధిష్టానం
- స్టేట్ ఆఫీస్ బేరర్లు, అధికార ప్రతినిధుల తీరుపై సీరియస్
- నివేదికలు సిద్ధం చేసిన రాష్ట్ర నాయకత్వం.. ఢిల్లీ పెద్దలతో చర్చలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బీజేపీలో త్వరలోనే భారీ ప్రక్షాళన జరగబోతోంది. పార్టీలో పనిచేయని నేతలను బాధ్యతల నుంచి తప్పించి, యాక్టివ్‌గా ఉండే వారికి బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. పదవులు తీసుకుని పార్టీ కార్యక్రమాలకు మొహం చాటేస్తున్న జిల్లా అధ్యక్షులు, స్టేట్ ఆఫీస్ బేరర్లు, అధికార ప్రతినిధులపై వేటు వేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రాథమిక నివేదికలను సిద్ధం చేసిన రాష్ట్ర నాయకత్వం.. ఢిల్లీ పెద్దలతో చర్చిస్తున్నట్టు సమాచారం. పార్టీ పదవులను కేవలం స్టేటస్ కోసమే వాడుకుంటున్నారన్న అసంతృప్తి అధిష్టానంలో కన్పిస్తోంది.
ఆఫీస్ మొహం చూడని నేతలు..
కేవలం జిల్లాల్లోనే కాదు.. రాష్ట్ర స్థాయి ఆఫీస్ బేరర్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మొత్తం 22 మంది ఆఫీస్ బేరర్లు ఉంటే, అందులో 8 మంది వరకూ పనితీరు అస్సలు బాలేదని తెలుస్తోంది. కొందరు వైస్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు స్టేట్ ఆఫీస్ మొహం కూడా చూడటం లేదని చర్చ జరుగుతోంది. కేవలం పదవులు అనుభవిస్తూ పార్టీకి ఏ మాత్రం ఉపయోగపడని వారిని ఇక ఉపేక్షించకూడదని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. మరోవైపు పార్టీ గొంతుకను బలంగా వినిపించాల్సిన అధికార ప్రతినిధుల పరిస్థితి మరీ దారుణంగా ఉందనే వాదనలున్నాయి.
మొత్తం 28 మంది అధికార ప్రతినిధుల్లో సగానికి పైగా టీవీ డిబేట్లలో గానీ, ప్రెస్ మీట్లలో గానీ కనిపించడం లేదని అధిష్టానం గుర్తించింది. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు.. జిల్లా అధ్యక్షులు, ఆఫీస్ బేరర్లను పిలిచి వార్నింగ్ ఇచ్చినా వారిలో మార్పు రావడం లేదని సమాచారం. దీంతో ‘పనిచేసే వాళ్లకే పదవులు’ అనే నినాదంతో కొత్త టీమ్‌ను రంగంలోకి దించాలని బీజేపీ పెద్దలు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రక్షాళన జరిగితేనే పార్టీలో కొత్త ఊపు వస్తుందని కేడర్ భావిస్తోంది. దీనిపై ఢిల్లీ పెద్దలతో జరుపుతున్న చర్చలకు అనుమతి రాగానే మార్పులు చేసేందుకు రాష్ట్ర అధిష్టానం సిద్ధమైంది.
జిల్లా అధ్యక్షులూ సైలెంట్..
రాష్ట్రంలో బీజేపీకి 38 సంస్థాగత జిల్లాలు ఉండగా, దాదాపు సగం మంది జిల్లా అధ్యక్షులు పార్టీ అనుకున్నంత స్థాయిలో పనిచేయడం లేదని రాష్ట్ర నాయకత్వం అంచనా వేసింది. వీరిలో ఐదారుగురు అధ్యక్షులైతే అసలు కార్యక్రమాలు చేయడం లేదనే విమర్శలు పార్టీలోనే వినిపిస్తున్నాయి. ఇటీవల ప్రధాని మోదీ సూచనలను, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వీరు పూర్తిగా విఫలమయ్యారని కేడర్ నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. కొన్ని జిల్లాల్లో అధ్యక్షులు కేడర్‌ను కలుపుకొని పోవడం లేదని, దీంతో పార్టీ గ్రాఫ్ పడిపోతోందని అధిష్టానం భావిస్తోంది. ఇలాంటి వారిని బాధ్యతల నుంచి తొలగించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
