వరంగల్, వెలుగు : ఈజీ మనీ కోసం బైక్ లను చోరీ చేస్తున్న ఇద్దరు యువకులను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సోమవారం వెల్లడించారు. మంచిర్యాల జిల్లా ఎన్‍టీపీసీ ఇందిరమ్మ కాలనీకి చెందిన దొంతుల ప్రశాంత్ కుమార్, జైపూర్ మండలం వేలాల గ్రామానికి చెందిన దుర్గం సాయి కార్తీక్ కలిసి ఈజీగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేశారు.
ఈ క్రమంలో వరంగల్, కరీంనగర్, రామగుండం, పెద్దపల్లి, సిద్దిపేట, హైదరాబాద్, రాచకొండ, జయశంకర్ భూపాలపల్లి పరిధిలో మొత్తం 28 బైక్ లను చోరీ చేశారు. ఒక్కో బైక్ ను రూ. 10 వేల నుంచి రూ. 15 వేలకే అమ్మేశారు. ఈ క్రమంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బైక్ చోరీలు పెరగడం, పలు కేసుల్లో నిందితులు వాడిన బైక్ లు చోరీ చేసినవే కావడంతో ఈ తరహా దొంగతనాలపై ఫోకస్ పెట్టాలని సీపీ శ్వేత ఆఫీసర్లను ఆదేశించారు.
దీంతో సెంట్రల్ జోన్ డీసీపీ కవిత ఆధ్వర్యంలో స్పెషల్ టీంలు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా మంచిర్యాలకు చెందిన ఇద్దరు అనుమానితులను గుర్తించారు. ఈ క్రమంలోనే ఇటీవల వాహనాలను తనిఖీ చేస్తుండగా.. చోరీ చేసిన పల్సర్ బైక్ పై వెళ్తున్న ఇద్దరు నిందితులు పట్టుబడ్డారు. పూర్తి వివరాలు ఆరా తీయగా.. బైక్ చోరీల విషయం వెలుగు చూసింది.
నిందితుల నుంచి వివిధ మోడళ్లకు చెందిన 28 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గతంలో కూడా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు గుర్తించారు. నిందితులను పట్టుకున్న సీసీఎస్ ఇన్ స్పెక్టర్లు ఎ.రాఘవేందర్, ఇ.హరికృష్ణ, కేయూసీ ఇన్ స్పెక్టర్ రవికుమార్, సీసీఎస్ ఎస్సై శ్రీనివాసరాజును సీపీ అభినందించారు.
