
షాద్ నగర్,వెలుగు: దేశంలో కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ కరువు, అవినీతి ఉంటాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీ సీనియర్ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి 3 వేల మంది అనుచరులతో తిరిగి సొంతగూటికి చేరగా.. శుక్రవారం షాద్ నగర్ ఏర్పాటు చేసిన సమావేశానికి కిషన్ రెడ్డి గెస్ట్ గా హాజరై కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పాలనను పందేండ్ల మోదీ పాలనను బేరీజు వేసుకుని ఓటు వేయాలని కోరారు. మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, టాయిలెట్ల నుంచి చంద్రయాన్ వరకు అగ్రభాగన నిలిపిన ఘటన ఆయనకే దక్కుతుందని కొనియాడారు. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చాక పాక్ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేశారని పేర్కొన్నారు.
మూడోసారి ప్రధానమంత్రిగా మోదీని చూడాలని, వచ్చే మూడేండ్లలో దేశంలో నిర్ణయాత్మక మార్పు తీసుకురానున్నట్టు చెప్పారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, పార్టీ నేతలు మోహన్ సింగ్, నరసింహ, మహేందర్ రెడ్డి, రిషికేశ్ పాల్గొన్నారు.