మైనార్టీలంటే ఓటు బ్యాంకు కాదు : రాంచందర్ రావు

మైనార్టీలంటే ఓటు బ్యాంకు కాదు : రాంచందర్ రావు
  •     దేశం కోసం వారు చేసిన త్యాగాలను గౌరవిస్తాం: రాంచందర్ రావు 

హైదరాబాద్, వెలుగు: మత మార్పిడుల కోసం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చేసిన క్రూరమైన ప్రయత్నాలను అడ్డుకొని, హిందూ ధర్మ రక్షణ కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టిన మహనీయుడు గురు తేగ్ బహదూర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడురాంచందర్ రావు కొనియాడారు. మైనార్టీలంటే తమకు ఓటు బ్యాంకు కాదని, దేశం కోసం వారు చేసిన త్యాగాలను గౌరవించడమే బీజేపీ విధానమని అన్నారు. 

సిక్కులు, ముస్లింలు, క్రిస్టియన్లు, పార్సీలు.. ఎవరైనా సరే దేశం కోసం పాటుపడే వారికి ఒకే రీతి గౌరవం దక్కుతుందని, ఇదే తమ భారతీయత అని స్పష్టం చేశారు. మంగళవారం ‘గురు తేగ్ బహదూర్ బలిదాన్ దివస్’ సందర్భంగా నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి రాంచందర్ రావు నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం కోసం గురు తేగ్ బహదూర్ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. సిక్కులు కేవలం ఇండియాలోనే కాదు.. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌‌‌‌లలో కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారని, అక్కడ వారు నిత్యం వేధింపులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 

గత ప్రభుత్వాలు వారిని రక్షించేందుకు సాహసం చేయలేకపోయాయని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్ (సీఏఏ)ను తీసుకొచ్చి.. పొరుగు దేశాల్లోని సిక్కులు, హిందువులకు భారత పౌరసత్వం కల్పించి అండగా నిలిచారన్నారు.