
- కేసీఆర్ ప్రభుత్వానికి మిగిలింది ఇంకొన్ని రోజులే
- మోడీ ఏ విషయంలో బలహీనుడో చెప్పాలని డిమాండ్
న్యూఢిల్లీ/హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్‌చుగ్ సవాల్ విసిరారు. ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని, టీఆర్‌ఎస్‌ను ఓడించడానికి ప్రజలు కూడా రెడీగా ఉన్నారని అన్నారు. ప్రభుత్వాన్ని రద్దు చేయకుండా, ఎన్నికల తేదీలు ప్రకటించాలని బీజేపీని సవాల్ చేయడం ఆయన చేతగానితనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. ఎన్నికల తేదీలు నిర్ణయించేది బీజేపీ కాదని, ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుందని అన్నారు. కేసీఆర్‌కు గట్స్ ఉంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఎన్నికలు పెట్టాలన్నారు. పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన బీజేపీ సభకు ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి కేసీఆర్ వణుకుతున్నారని, ఆ భయంతోనే ఇలా మాట్లాడుతున్నారని అన్నారు. సభలో లక్షలాది మంది మోడీ, మోడీ అని అరవడాన్ని కేసీఆర్ కుటుంబమంతా కూర్చుని టీవీలో లైవ్ చూశారన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి ఇంకొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని, ప్రజలు ఆ పార్టీని సాగనంపాలని నిర్ణయించుకున్నారని, మోడీ డబుల్ ఇంజిన్ సర్కార్‌ను ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.
ఎందుకంత అక్కసు
రాజకీయాలను పక్కనబెడితే.. ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విషయంలో కేసీఆర్ వాడిన భాష సరికాదని తరుణ్‌చుగ్ అన్నారు. కేసీఆర్ చంద్రుని మీద ఉమ్మేసే ప్రయత్నం చేస్తున్నాడని, అది ఆయన మీదనే పడుతుందన్నారు. గతంలో సర్జికల్ స్ట్రయిక్స్ విషయంలో అనుమానాలు వ్యక్తం చేసి, ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్‌లో చైనాను నిలువరించలేరని వ్యాఖ్యానించి దేశ ఆర్మీని అవమానిస్తున్నాడని ఆరోపించారు. ఇండియా మీద కేసీఆర్‌కు ఎందుకంత అక్కసో అర్థం కావడం లేదన్నారు. ఇండియాను తక్కువ చేసి చూపడానికి బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్, చైనా దేశాలను పొగుడుతున్నారన్నారు. యుద్ధాల కారణంగా డాలర్ రేటు పెరిగిందని, అది తాత్కాలికమేనన్న విషయాన్ని కేసీఆర్ తెలుసుకోవాలన్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని కేసీఆర్ అంటున్నారని, ఒకవేళ అదే నిజమైతే కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడగలడా అని ప్రశ్నించారు. అసలు ఎమర్జెన్సీ అంటే ఏందో, 1975లో పరిస్థితులు ఎలా ఉండేవో కేసీఆర్ తెలుసుకోవాలన్నారు. మోడీ ఏ విషయంలో బలహీనుడో చెప్పాలని, ఎన్నికలకు వెళ్తే ఎవరు బలవంతులో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. ఆయనలా అవినీతి, కుటుంబ రాజకీయాలు చేయకపోవడం వల్ల కేసీఆర్‌కు మోడీ బలహీనంగా కనిపిస్తున్నాడేమోనని ఎద్దేవా చేశారు.
క్రైమ్‌లో నంబర్ వన్
‘‘దేశంలో తెలంగాణ నంబర్ వన్ అని కేసీఆర్ అంటున్నారు. ఈ విషయంలో నేను కూడా ఏకీభవిస్తున్నా. అయితే అది అభివృద్ధిలో కాదు. పోక్సో కేసుల్లో తెలంగాణ నంబర్ వన్. దేశంలో పోక్సో కేసుల సగటు 28.9 శాతం ఉంటే, తెలంగాణలో 36.9 శాతం ఉంది. అప్పుల్లో కూడా తెలంగాణను కేసీఆర్ నంబర్ వన్ చేశారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని రూ.3.29 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారు” అని తరుణ్‌చుగ్ ఎద్దేవా చేశారు. ఊకదంపుడు ఉపన్యాసాలు బంద్‌పెట్టి వర్షాలు, వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు, రైతులను ఆదుకునే విషయంపై కేసీఆర్ ఫోకస్ చేయాలని హితవు పలికారు.