కాంగ్రెస్ ఓబీసీ వ్యతిరేక పార్టీ..కర్నాటకలో ఓబీసీని దించి ఓసీని సీఎం చేశారు: రాంచందర్ రావు 

కాంగ్రెస్ ఓబీసీ వ్యతిరేక పార్టీ..కర్నాటకలో ఓబీసీని దించి ఓసీని సీఎం చేశారు: రాంచందర్ రావు 
  • కాంగ్రెస్‌‌‌‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అగ్రకులాల వారే సీఎంగా ఉన్నారని విమర్శ

సూర్యాపేట, వెలుగు: కాంగ్రెస్ ఓబీసీల వ్యతిరేక పార్టీ అని, కర్నాటకలో ఓబీసీ సీఎంను గద్దె దించి, అగ్రకులానికి అవకాశం ఇచ్చారని బీజేపీ స్టేట్‌‌ చీఫ్‌‌ రాంచందర్‌‌‌‌ రావు విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లోనూ అగ్రకులాల వారే సీఎంలుగా ఉన్నారని, ఓబీసీలపై కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోందని మండిపడ్డారు. సూర్యాపేటలో బీజేపీ జిల్లా స్థాయి కార్యకర్తల శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ దెబ్బతీస్తే, ఆ అవమానం భరించలేకే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తుచేశారు.

కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదాన్ని మొదట ఇచ్చింది ఎన్టీఆరేనని, అలాంటిది సీఎం రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం రాజకీయ స్వార్థం కోసమేనని విమర్శించారు. మరోవైపు, ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తేమ శాతం పేరుతో రైతుల ధాన్యానికి కోతలు విధిస్తున్న మిల్లర్లతో ప్రభుత్వం కుమ్మక్కైందని, రైతులు తమ పంటను తక్కువ ధరకు అమ్ముకునేలా సమస్యలు సృష్టిస్తోందని మండిపడ్డారు.

రైతులు రోడ్లమీద ఏడుస్తుంటే, ప్రభుత్వం మాత్రం రూ.250 కోట్లకు ఎకరం చొప్పున భూములు అమ్ముకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందన్నారు. ప్రతి గింజ కొంటామని మాటిచ్చిన మంత్రులు.. ఇప్పుడు కేంద్రం కొనడం లేదంటూ అబద్ధాలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ చేపట్టిన ‘రైతు గోస -బీజేపీ భరోసా’యాత్రనే మేల్కొల్పిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం రూ.13 లక్షల కోట్లు కేటాయించిందని, కేంద్రం నిధులిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోందని విమర్శించారు.