ప్రజా వ్యతిరేక విధానాలపై మా పోరాటం కొనసాగిస్తాం

ప్రజా వ్యతిరేక విధానాలపై మా పోరాటం కొనసాగిస్తాం

బండి సంజయ్ ప్రజా సంగ్రామ -యాత్రపై కోర్టు తీర్పు తెలంగాణ ప్రజల విజయని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమెందర్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ ఏర్పాట్లు  ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు. ఈ సభకు పోలీసులు సహకరించాలని కోరారు. ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాటం కొనసాగుతుందన్నారు. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు లైన్ క్లియర్ చేసింది. పాదయాత్ర ఆపాలంటూ వరంగల్ పోలీసులు ఇచ్చిన నోటీసులను రద్దు చేసింది. బుధవారం బీజేపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటీషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జనగామ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్రలో ఉన్న బండి సంజయ్.. మంగళవారం ఎమ్మెల్సీ కవిత ఇంటిని ముట్టడించిన ఘటనలో బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ దీక్షకు దిగారు. అయితే దీక్షను భగ్నం చేసిన పోలీసులు బండి సంజయ్ ను వెంటనే పాదయాత్రను నిలిపివేయాలంటూ నోటీసులు ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో బండి పాదయాత్ర చేపడితే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశముందని అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు పోలీసు నోటీసులను సవాల్ చేస్తూ బుధవారం హైకోర్టును ఆశ్రయించారు.  లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం పాదయాత్రకు ఓకే చెబుతూ ఉత్తర్వులు జారీ చేసింది.