గ్యాస్ కష్టాలు తీవ్రం..హైదరాబాద్లో హాస్టళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లకు కట్టెల పొయ్యే దిక్కు..

గ్యాస్ కష్టాలు తీవ్రం..హైదరాబాద్లో హాస్టళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లకు కట్టెల పొయ్యే దిక్కు..
  •  
  • హాస్టల్స్​ ఎదుట కట్టెల కుప్పలు..  హోటళ్లు, రెస్టారెంట్లూ అదే బాట
  • సిటీలో 20 వేల వరకు ప్రైవేట్​ హాస్టల్స్
  • ఇందులో 6 లక్షల ఐటీ ఎంప్లాయీస్.. మరో 8 లక్షల మంది స్టూడెంట్స్.. వేరే జాబ్స్​ చేసేవాళ్లు  మరో 4 లక్షలు
  • ఐటీ కారిడార్స్ హాస్టల్స్‌‌లో టీ, కాఫీ, బ్రేక్ ఫాస్ట్, అడిషనల్​ మీల్స్ క్యాన్సిల్
  • ఇప్పటికే రూ.2,500 పలుకుతున్న గ్యాస్​ ధర..అయినా 25 శాతం మాత్రమే సరఫరా
  • హాస్పిటల్స్, విద్యా సంస్థల మాదిరిగా తమనూ ఎమర్జెన్సీ కోటాలో చేర్చాలని హాస్టల్స్​ ఓనర్స్​ డిమాండ్


హైదరాబాద్ సిటీ/ముషీరాబాద్​/గచ్చిబౌలి, వెలుగు:  ఇరాన్ –- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఎఫెక్ట్ హైదరాబాద్‌‌ నగరంలోని హాస్టల్స్, హోటల్స్, రెస్టారెంట్లపై పడింది. యుద్ధం కారణంగా ముడిచమురు సరఫరా తగ్గడంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమైంది. ముందుగా డొమెస్టిక్​ అవసరాలకే ప్రాధాన్యత ఇస్తూ..కమర్షియల్​ డెలివరీపై 75 శాతం నిషేధం విధించి కేవలం 25 శాతం మాత్రమే సరఫరా చేస్తుండడంతో హాస్టల్స్, హోటల్స్‎ నిర్వాహకులు ఇబ్బందుల్లో పడ్డారు. ఇప్పుడు తమ దగ్గరున్న గ్యాస్ ​రెండు రోజుల్లో అయిపోతుందని, ఆ తర్వాత తమ సంగతి ఏమిటని వాపోతున్నారు. పలు హాస్టళ్ల నిర్వాహకులు ముందే తేరుకొని.. కట్టెలు తెప్పించుకొని పెట్టుకున్నారు. దీంతో కొన్ని హాస్టళ్ల ఎదుట కట్టెల కుప్పలు దర్శనమిస్తున్నాయి. అలాగే, పొదుపు చర్యల్లో భాగంగా హాస్టల్స్‌‌లో ఒక్కసారిగా మెనూ మార్చేశారు. మార్నింగ్​ బ్రేక్​ఫాస్ట్‌‌ను బంద్‌‌పెట్టారు.  అధిక గ్యాస్ వినియోగమయ్యే ఆహార పదార్థాల తయారీని నిలిపివేశారు. మరోవైపు గ్యాస్ కొరత కారణంగా ఇప్పటికే కొన్ని హోటల్స్, రెస్టారెంట్లు మూతపడ్డాయి. ఇంకొన్ని ఒక్క పూటే నడిపిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే  పూర్తిగా బంద్ చేసుకోవాల్సి వస్తుందని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

18 లక్షల మందిపై ప్రభావం

నగరంలో దాదాపు 20 వేల వరకు హాస్టల్స్ ఉన్నాయి. వీటిల్లో దాదాపు 6 లక్షల ఐటీ ఎంప్లాయీస్​, మరో 8 లక్షల మంది స్టూడెంట్స్, 4 లక్షల మంది వరకు నాన్​ఐటీ ఎంప్లాయీస్, వర్కింగ్​విమెన్స్‌‌​ఉంటున్నారు.  గ్యాస్ కొరతతో కొద్ది రోజులు పొదుపు చర్యలు పాటించాలని హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. సమస్య తీరే వరకు కొన్ని ఆహార పదార్థాలను సర్వ్ చేయొద్దని నిర్వాహకులకు సూచించింది. ఉదయం టిఫిన్స్‌‌‌‌లో భాగంగా పెట్టే వడ, దోశ, పూరి, చపాతీ, మైసూర్ బోండాతోపాటు టీ, కాఫీలు బంద్ చేయాలని సలహా ఇచ్చింది. నూనె పదార్థాలతో చేసే వంటలు తాత్కాలికంగా ఆపేయాలని సూచించింది. బేసిక్ మీల్స్ పెట్టాలని చెప్పింది. కాగా, గ్యాస్​ కొరతతో కేపీహెచ్‌‌‌‌బీ, కూకట్‌‌‌‌పల్లి, మాదాపూర్, కొండాపూర్​, గచ్చిబౌలి ఏరియాల్లోని హాస్టల్​ నిర్వాహకులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. గ్యాస్ ​సిలిండర్లు రాకపోతే కట్టెల పొయ్యిపై వంట చేయ డానికి కట్టెలు తెచ్చి పెట్టుకుంటున్నారు. 
 
డొమెస్టిక్​ కోటాలో చేర్చండి..

హాస్టళ్లకు అవసరమైన గ్యాస్‌‌‌‌లో కేవలం 25 % మాత్రమే సరఫరా అవుతున్నది. 4  సిలిండర్లు కావాల్సిన చోట ఒకటి కూడా దొరకని పరిస్థితి నెలకొన్నది. దీనికి తోడు మార్కెట్‌‌‌‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2,101 పలుకుతున్నది. అంత  ధర పెట్టడానికి రెడీగా ఉన్నా..గ్యాస్​ దొరికే పరిస్థితి కనిపించడం లేదు. వందల మంది విద్యార్థులు, ఉద్యోగులు ఉండే ప్రైవేట్​ హాస్టల్స్‌‌‌‌లో వంట చేయాలంటే రోజుకు కనీసం 2 పెద్ద సిలిండర్లు కావాలని, బ్లాక్ మార్కెట్‌‌‌‌లో వేలు పెట్టి కొనే స్థోమత తమకు లేదని హాస్టల్స్ నిర్వాహకులు అంటున్నారు. ఇలాగే కొనసాగితే హాస్టల్స్ మూసివేయాల్సి వస్తుందం టున్నారు.  దవాఖానలు, విద్యాసంస్థల హాస్టల్స్‌‌‌‌కు ఎమర్జెన్సీ కోటా కింద ఇస్తున్నట్టుగానే తమకూ ఇవ్వాలని కోరుతున్నారు. హాస్టల్స్​మూసివేస్తే ఐటీ రంగంలో జాబ్​చేసే వాళ్లు ఇండ్లకు వెళ్లిపోతారని లేదా వర్క్​ఫ్ర్ హోం చేసే వరకు వెళ్తుందని చెబుతున్నారు.

రెస్టారెంట్లు, హోటల్స్‌‌‌‌దీ ఇదే పరిస్థితి

కమర్షియల్ ​సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో 90% హోటళ్లు, రెస్టారెంట్ల ఓనర్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇలాగే కొనసాగితే వచ్చే 48 గంటల్లో అన్ని క్లోజ్​చేయాల్సి వస్తుందని తెలంగాణ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ హెచ్చరించింది. ఇప్పటికే కొన్ని చోట్ల హోటల్స్​ బంద్​ చేసుకున్నారు. మరికొందరు గ్యాస్​పొదుపు చర్యలు మొదలుపెట్టారు. కొన్ని రెస్టారెంట్లు కొన్ని ఐటమ్స్‌‌‌‌ను మెనూ నుంచి తొలగిస్తున్నాయి. బుధవారం నగరంలో రంజాన్​మాసం 21వ రోజు సందర్భంగా పలు హోటల్స్​ మూసివేయడంతో తీవ్రత కనిపించలేదు.  

హోటల్స్‌‌‌‌లో కట్టెల పొయ్యిపై వంటలు.. 

కమర్షియల్​ సిలిండర్లు దొరక్కపోవడంతో నగరంలోని కొన్ని హోటల్స్​ ఆల్టర్నేట్​రూట్స్​ చూసుకుంటున్నాయి. ప్రముఖ హోటల్​అయిన షా గౌస్.. నగరంలోని తమ అన్ని బ్రాంచీల్లో కట్టెల పొయ్యిపై వంటలు వండడం మొదలుపెట్టింది. ఈ విషయం తెలిసిన ఇతర హోటల్స్​యజమానులు కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు. సికింద్రాబాద్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌‌‌‌‌‌‌‌పేట్​, ఎస్సార్‌‌‌‌‌‌‌‌ నగర్​, కూకట్‌‌‌‌పల్లి, కోఠి, అబిడ్స్​, దిల్‌‌‌‌సుఖ్‌‌‌‌ నగర్, ఎల్బీనగర్​బంజారాహిల్స్​లాంటి ప్రాంతాల్లోనూ కట్టెల పొయ్యిపై వంటలు స్టార్ట్​ చేశారు. దీంతో కట్టెలకు కూడా డిమాండ్​పెరిగింది. 

మూత పడుతున్న హోటల్స్​ 

కమర్షియల్ సిలిండర్ కొరతతో బుధవారం సిటీలో కొన్ని హోటల్స్ మూతపడ్డాయి. రంజాన్ నెల 21వ రోజు కావడంతో ఇరానీ హోటల్స్  మూసివేశారు. చిన్నా చితక హోటల్స్ మాత్రం కమర్షియల్ సిలిండర్లు సప్లై లేదంటూ నడపలేమంటూ బంద్ ​పెట్టారు. విద్యానగర్, నల్లకుంట, చిక్కడపల్లి, ముషీరాబాద్ గాంధీనగర్,  నారాయణగూడ, కవాడిగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్ తది తర ప్రాంతాల్లో రంజాన్ 21 రోజుతో కొన్ని హోటల్స్ మూసివేయగా.. గ్యాస్ సిలిండర్లు కొరతతో మరికొన్ని హోటల్స్ క్లోజ్‌‌‌‌ చేశారు. 

డొమెస్టిక్ సిలిండర్​ పక్కదారి...

కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,101 ఉన్నప్పటికీ చాలా చోట్ల బుక్​ కావడం లేదు. దీంతో డొమెస్టిక్​ సిలిండర్లకు డిమాండ్​ పెరిగింది. కొంతమంది డెలివరీ బాయ్స్‌‌‌‌, ఏజెన్సీ డీలర్లు హాస్టల్స్​, హోటల్స్​, రెస్టారెంట్​నిర్వాహకులకు బ్లాక్ ​మార్కెట్‌‌‌‌లో డొమెస్టిక్ ​సిలిండర్లు ఇస్తున్నారు. 14.2 కిలోలు ఉండే ఒక్కో గృహావసరాలకు వాడే సిలిండర్‌‌‌‌‌‌‌‌ను బ్లాక్​లో రూ.1,800 నుంచి రూ.2 వేల వరకు అమ్ముతున్నారు. దీంతో డొమెస్టిక్​వినియోగదారులు గ్యాస్​ బుక్​చేసిన వారానికి కూడా సిలిండర్​ రావడం లేదు. కొందరు డెలివరీ బాయ్స్​ కస్టమర్లకు ఎంతో కొంత ఇస్తామని వారి దగ్గర ఓటీపీలు తీసుకొని బ్లాక్ మార్కెట్‌‌‌‌లో అమ్ముకుంటున్నారు. దీంతో నిజంగా అవసరం ఉన్న వారికి టైమ్‌‌‌‌కు సిలిండర్‌‌‌‌‌‌‌‌ అందడం లేదు. ఇదే అవకాశంగా కొందరు డొమెస్టిక్​ సిలిండర్ల నుంచి  గ్యాస్‌‌‌‌ను కమర్షియల్ సిలిండర్లలోకి ఫిల్లింగ్ చేసి అక్రమ దందా చేస్తున్నారు.  

బుకింగ్​ కావట్లే  

 చాలా మంది తాము గ్యాస్​ కోసం బుక్ ​చేయడానికి ట్రై చేస్తున్నా.. కావడం లేదని ఫిర్యాదులు చేశారు. సాధా రణంగా ఆయా ఏజెన్సీల యాప్‌‌‌‌లతో పాటు ఫోన్​పే, గూగుల్​పే, క్రెడ్​, భీమ్, పేటీఎమ్​యాప్​ల ద్వారా ఆన్​లైన్​లో గ్యాస్ ​బుక్​ చేసుకునే వెసులుబాటు ఉంది. దీంతోపాటు వాట్సాప్ ​ద్వారా, మిస్ట్​కాల్​ సర్వీస్​ద్వారా కూడా గ్యాస్ ​బుక్​ చేసుకుని తెప్పించుకోవచ్చు. అయితే, 2 రోజులుగా బుకింగ్​ తాకిడి ఎక్కువై, దీంతో సర్వర్లపై భారం పడి ఎర్రర్​ వస్తున్నదని డీలర్లు చెప్తున్నారు.  

ఐటీ ఉద్యోగులకు ఆకలి మంటలు.

కమర్షియల్ గ్యాస్ ​కొరతపై బుధవారం గచ్చిబౌలి ప్రశాంత్​ హిల్స్‌‌‌‌లో హాస్టల్స్​అసోసియేషన్​ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. అసొసియేషన్​ ప్రెసిడెంట్​అమర్‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌ రెడ్డి మాట్లాడుతూ.. వారం రోజులుగా కమర్షియల్​ గ్యాస్ సరఫరా 75 % నుంచి 80 శాతం వరకు పడిపోయిందని వాపోయారు. రోజుకు 100 సిలిండర్లు అవసరమైతే కేవలం 20 మాత్రమే అందుబాటులోకి వస్తున్నాయన్నారు. సిలిండర్‌‌‌‌‌‌‌‌కు అధికారిక ధర రూ.2,110 ఉండగా, బ్లాక్ మార్కెట్‌‌‌‌లో రూ.3 వేల నుంచి రూ. 3,500 వరకు అమ్ముతున్నారన్నారు. తమకు ఉన్న సమాచారం మేరకు నగరవ్యాప్తంగా 11వేల హాస్టల్స్ అండ్​ పీజీలు ఉన్నాయని, వీటిలో 10 లక్షల మంది ఐటీ నిపుణులు, విద్యార్థులు ఉంటున్నారన్నారు. వీరికి భోజనం అందించడం ఇప్పుడు సవాల్‌‌‌‌గా మారిందన్నారు. గ్యాస్ వినియోగాన్ని తగ్గించేందుకు   హాస్టల్స్‌‌‌‌లో పెట్టే ఆహార పదార్థాల్లో కోతలు విధిస్తూ నోట్​విడుదల చేశామన్నారు. కేవలం అన్నం, పప్పు మాత్రమే అందిస్తున్నట్టు తెలిపారు. రెండు రోజుల్లో గ్యాస్ నిల్వలు అయిపోతే లక్షలాది మంది ఉద్యోగుల ఆకలికి దారితీస్తుందన్నారు. హాస్టళ్లకు ఇచ్చే సిలిండర్లను కమర్షియల్ విభాగం నుంచి డొమెస్టిక్ కేటగిరీలోకి మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు.  

సీఎన్‌‌‌‌జీ, ఎల్‌‌‌‌పీజీ కృత్రిమ కొరత...

రెండు రోజుల నుంచి కొన్ని బంకుల్లో సీఎన్‌‌‌‌జీ, ఎల్‌‌‌‌పీ జీ ధరలు పెంచుతున్నారు. యుద్ధం జరుగుతున్నప్పటికీ సరిపడా ఇంధన నిల్వలున్నాయని అధికారులు చెప్తున్నా హైదరాబాద్​లోని కొందరు నిర్వాహకులు కృత్రిమ కొరత సృష్టిస్తూ.. ఎక్కువ ధరలకు అమ్ముకుం టున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 4 రోజుల క్రితం వరకు ఎల్‌‌‌‌పీజీ ధర లీటర్ రూ.64  ఉండగా, ప్రస్తుతం రూ.67.97గా ఉంది. కొన్ని చోట్ల రూ.100 వరకు విక్రయిస్తున్నట్టు ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. 

25 శాతం అదనపు సరఫరా ఉన్నా.. 

ప్రస్తుతం ఉన్న డిమాండ్ కంటే 25 శాతం అదనంగా పెంచి సిలిండర్లను సరఫరా చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా.. వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. ముందు ముందు సిలిండర్లు దొరుకుతాయో లేదోనన్న భయంతో అందరూ అవసరం లేకున్నా బుక్​ చేస్తుండడంతో తీవ్ర కొరత ఏర్పడుతున్నది. దీంతో ఇరాన్‌‌‌‌లోని హార్మూజ్ జలసంధి నుంచి కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా భారత నౌకలు వస్తున్నాయని, అవి వస్తే ఇప్పుడున్న డిమాండ్​కు మించి సరఫరా చేస్తామని కేంద్రం స్పష్టం చేస్తున్నది. ఇతర ప్రాంతాల నుంచి కూడా గ్యాస్​నిల్వలు రప్పిస్తున్నామని, ఒకటి రెండు రోజులు మాత్రమే ఇబ్బందులు ఉంటాయని కంగారు పడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తున్నది. ఇక నుంచి రెండు రోజుల్లో సిలిండర్ రాకపోతే ఫిర్యాదులు చేయాలని కోరుతున్నది. 

ఇంత షార్టేజ్​ అవుతదనుకోలే..

 ఇంత మొత్తం షార్టేజ్ అవుతుందని అనుకోలేదు. హాస్టల్స్ బంద్ చేసే ఉద్దేశం లేదు. గ్యాస్ షార్టేజ్ వల్ల  గ్యాస్ సేవ్ చేయడంతోపాటు హెల్దీ ఫుడ్‌‌‌‌పై ఫోకస్ పెట్టాం. కట్టెల పొయ్యిలు వినియోగించాలని చూస్తున్నం. 50 నుంచి 60 మంది ఉన్న చిన్నచిన్న హాస్టల్స్ వారు ఎలక్ట్రానిక్‌‌‌‌ స్టవ్‌‌‌‌లపై మ్యానేజ్ చేస్తున్నారు. రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా డిమాండ్ లేకపోవడంతో పెద్ద ఎలక్ట్రికల్ కుక్కర్లు లభిం చడంలేదు. వీటికోసం కొందరు ఇప్పటికే అడ్వాన్స్‌‌‌‌లు ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను పెంచితే బాగుంటుంది.  
- వెల్లంపల్లి మహిధర్, ట్రెజరర్‌‌‌‌‌‌‌‌, 
ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్

హోటల్స్ మూతపడేలా ఉన్నయ్‌‌‌‌..

గ్యాస్ కొరత కారణంగా హోటల్స్ మూతపడే అవకాశముంది. 2, 3 రోజులకు సరిపడా స్టాక్ మాత్రమే ఉన్నది. ఆ తర్వాత 70% హోట ల్స్ క్లోజ్ అయ్యేలా ఉన్నాయి. కట్టెల పొయ్యి ఉపయోగిద్దామంటే అన్ని హోటల్స్‌‌‌‌  గ్రౌండ్ ఫ్లోర్లలో లేవు. పెండ్లిళ్ల సీజన్ కావడంతో క్యాట రింగ్‌‌‌‌కు సంబంధించి కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. 
– కంచర్ల అశోక్ రెడ్డి, తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్, హైదరాబాద్ ప్రెసిడెంట్